వేల్పూర్, జూలై 25: దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ ఎలాగో.. తెలంగాణకు సీఎం కేసీఆర్ కూడా అలాగేనని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం హన్మాన్నగర్లో మూడు నెలలపాటు బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థులకు అందించిన ఉచిత కోచింగ్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ…కోచింగ్ సెంటర్లో అభ్యర్థులకు అన్ని సమకూర్చామని, ఉద్యోగం సాధించడమే ముందున్న లక్ష్యమన్నారు.
తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి కేసీఆర్ అని చెబుతూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ర్టాన్ని సాధించారు…సాధించిన తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపారన్నారు. ఒకేసారి 90వేల ఉద్యోగాలు ప్రకటించి నోటిఫికేషన్ ఇస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పైరవీలకు తావులేకుండా ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు దక్కాలని ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేశారన్నారు. 12 ఏండ్లుగా కేసీఆర్‌ను అత్యంత దగ్గరగా చూస్తున్న వ్యక్తినని..ఆయన ఆలోచన, ఆచరణ అంతా తెలంగాణ కోసమేనని చెప్పారు.
ఉచిత కోచింగ్ సెంటర్ విజయవంతం కోసం నిర్విరామంగా పనిచేసిన గంగాధర్ గౌడ్, రేగుళ్ల రాములు, మల్లేశ్, శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీపీ నాగరాజు మాట్లాడుతూ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం సాధించి మంత్రికి గిఫ్ట్‌గా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ ప్రభాకర్, ఎంపీపీ భీమ జమున తదితరులు పాల్గొన్నారు.