కామారెడ్డి, ఆగస్టు 11: రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా మాట్లాడారు. మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ ఇంటి నుంచి నిర్వహించిన వీసీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పా ల్గొన్నారు. మహిళలకు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లతోపాటు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయనే విషయమై మం త్రి కేటీఆర్ నేరుగా లబ్ధిదారులతో మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో ఆడబిడ్డల పెండ్లి కోసం రూ.లక్షా 116వేలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. పథకాల అమలులో జాప్యం చేయకుండా ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆగస్టు 15 తర్వాత మరో 10లక్షల పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎక్కడా రాజీ పడకుండా పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా మహిళలందరూ సీఎం కేసీఆర్కు రాఖీలు కట్టి అండగా నిలువాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం తాత్కాలిక ప్రయోజనం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమలుచేస్తున్నారని తెలిపారు. గతంలో పింఛన్ రూ.200 మాత్రమే ఇచ్చేవారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దివ్యాంగుల రూ.3,016, ఒంటరి మహిళలకు రూ.2,016 పింఛన్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ చేసుకున్న మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. వివిధ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉన్నామని లబ్ధిదారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.