కంఠేశ్వర్, జూలై 11: జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి బ్యాంకర్లకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, ప్రస్తుత వానకాలం పంటలకు రైతాంగానికి అం దించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర, ఇతర అన్ని రంగాలకు కలిపి రూ.17, 990.59 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ.13,928. 92 కోట్ల రుణ సదుపాయం కల్పించాలని వార్షిక ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని, రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ముఖ్యంగా ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులకు విద్యా రుణాలను అందించేందుకు చొరవ చూపాలన్నారు. వీధి వ్యాపారాలు నిర్వహించే వారికి సూక్ష్మ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో 60 ఏండ్లు పైబడిన వారికి కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి, అవసరమైన వారికి రుణాలందించాలని సూచించారు.
ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది దివ్యాంగులు సభ్యులుగా ఉన్న సంఘాలకు కూడా ఖాతాలు తెరిచేందుకు అనుమతించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తిస్థాయిలో లింకే జీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్బీఐ ఎల్డీవో రాములు, డీఆర్డీవో సాయాగౌడ్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.