ఖలీల్వాడి, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదుకావడంతోపాటు ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా, సీపీ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సందేశం అనంతరం కలెక్టర్ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సుమారు 94 కోట్ల 50 లక్షల పైచిలుకు ఓటర్లు కలిగిన మనదేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దదని తెలిపారు. ఓటు హక్కు ద్వారా ఎంతో పారదర్శకంగా మనల్ని పరిపాలించే నాయకులను ఎన్నుకోగలుగుతున్నామని అన్నారు. ప్రలోభాలకు లోనై ఓటును దుర్వినియోగం చేస్తే, అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంతమాత్రం సరికాదన్నా రు. ఎలక్షన్ డే అంటే హాలీడే కాదని, మన భవితను నిర్దేశించుకునే అతి కీలకమైన రోజుగా గుర్తించాలని ఓటర్లకు సూచించారు. ఎన్నికల్లో సగటున 67 శాతం మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని, విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాలు, నగరాల్లో ఓటింగ్ శాతం మరింత తక్కువగా నమోదకావడం దురదృష్టకరమన్నారు. మనల్ని పాలించే వారిని మనం ఎన్నుకునే బాధ్యతను విస్మరించడం ఎంతవరకు సమంజసమో ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.
ఇదివరకు ప్రతిఏడాది జనవరి ఒకటిన కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో నమోదు చేసేవారన్నారు. ప్రస్తుతం ఏడాదిలో నాలుగు పర్యాయాలు నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీపీ కెఆర్.నాగరాజు మాట్లాడుతూ.. జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా 18 ఏండ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటుహక్కును ప్రసాదించిందన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గుర్తించి యువత ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను ఓటరు నమోదు ప్రక్రియ విధులను సమర్థవంతంగా నిర్వహించిన బీఎల్వోలు, ఎన్నికల అధికారులను కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున సత్కరించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, ఆర్డీవో రవి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ఓటర్లు పాల్గొన్నారు.