
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే ప్రస్తుతం కలకలం రేపుతున్న బ్లాక్ఫంగస్పైనా ప్రభుత్వం దృష్టిసారించింది. బ్లాక్‌ఫంగస్ చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో 50పడకల ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం నలుగురు వైద్యులు, సిబ్బందిని ఇప్పటికే నియమించారు. త్వరలోనే ఈ వార్డును ప్రారంభించనుండగా.. అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు.
ఖలీల్‌వాడి, మే 26: నిజామాబాద్‌లోని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో బ్లాక్ ఫంగస్ వార్డును ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ బ్లాక్ ఫంగస్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోనే మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీజీహెచ్‌లోని కొవిడ్ వార్డులోనే ఒక విభాగంలో ప్రత్యేకంగా బ్లాక్ ఫంగస్ రోగుల కోసం వార్డు సిద్ధమవుతున్నది. ఈవార్డులో 50 బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. నలుగురు వైద్యులతోపాటు పలువురు సిబ్బంది సేవలను అందించనున్నారు. ఈ వార్డులో టీఎన్టీ వైద్యుడు, ఛాతి వైద్య నిపుణుడు, జనరల్ ఫిజిషియన్‌తో పాటు మరో వైద్యుడు అందుబాటులో ఉంటారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలో అందిస్తున్న సేవలతో కొవిడ్ బాధితులు అధిక సంఖ్యలో కోలుకొని ఇండ్లకు వెళ్తున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు, కలెక్టర్ సహకారంతో మెరుగైన సేవలు అందుతుండగా.. బ్లాక్ ఫంగస్‌కు సంబంధించి చికిత్స అందించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన మందులను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో వార్డు ఏర్పాటు కానున్నది.