రెండున్నర నెలల క్రితం నూతన సంవత్సర సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రగతి నగర్‌లోని ఓ బేకరీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేక్‌ను ఆర్డర్ చేశాడు. రాత్రి కేక్‌ను కట్ చేసి ఆనందోత్సవాలతో సంబురాలు చేసుకుంటున్న క్రమంలో కేకులో ప్లాస్టిక్ వ్యర్థాలు వెలుగు చూశాయి. ఇదేంటని బేకరీ బాధ్యులను సదరు టీచర్ అడిగితే వంకర సమాధానాలు ఎదుర్కొన్నాడు. పైగా కష్టమర్నే బేకరీ నిర్వాహకులు బెదిరించడం కొసమెరుపు.
నిజామాబాద్ కార్పొరేషన్ సమీపంలోని ఓ హోటల్లో వినియోగదారులు బిర్యాని ఆర్డర్ ఇవ్వగా అందులో నాణ్యత లేమి కనిపించింది. రైథాలో ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చాయి. ఇదేంటని కస్టమర్లు అడిగితే తీసేసి తినాలంటూ ఉల్టా జవాబిచ్చారు. చేసేది లేక సదరు వ్యక్తులు నేరుగా ఆహార భద్రత, కల్తీ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. నెల రోజులవుతోన్న పట్టించుకోవడం లేదు. ఇదీ ఓ వినియోగదారుడి బాధ.
బస్టాండ్ సమీపంలో ఈ మధ్యే వెలిసిన ఓ హోటల్లోనూ ఇదే రకమైన తంతు వెలుగు చూసింది. బిర్యానీలో లైట్ పురుగులు పడటాన్ని వినియోగదారులు గుర్తించారు. తీసేసి అదే గిన్నెలో బిర్యానీని తిరిగి సర్వ్ చేసినట్లుగా కస్టమర్లు గుర్తించి కౌంటర్ వద్ద గొడవ పెట్టుకున్నారు. తినకుండానే వారు బయటకి వెళ్లి పోయారు. ఇదీ మరొక వినియోగదారుడికి ఎదురైన వింత ఘటన.
నిజామాబాద్, మార్చి 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇలా చెప్పుకుంటూ పోతే నిజామాబాద్ నగరంతో పాటుగా కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ వంటి పట్టణాల్లో వెలసిన అనేక రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీల్లో ఈ రకమైన తంతు ఘోరంగా వెలుగు చూస్తున్నాయి. అన్నంలో పురుగులు, చెడిపోయిన కర్రీలు, నాణ్యతలేని బిర్యానీలు, వాసన కొడుతున్న మాంసపు ముక్కలు ఇలా చెప్పుకుంటూ పోతే వందలకు వందలు డబ్బులు పెట్టి తింటున్న ఆహారంలో ఎక్కడా నాణ్యత అన్నది దొరకడం లేదు. ఈ మధ్య కాలంలో బేకరీల్లోనూ ఆహార పదార్థాలు కంపు కొడుతున్నాయి. పాచిపోయిన ఐటమ్స్‌ను వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. బేకరీల్లో ఎక్కువగా యువత ఎగబడి కేకులు, బర్గర్లు, పిజ్జాలు, పఫ్‌లు తింటున్నారు. వీటిని ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్‌గా తయారు చేసి వినియోగదారులకు అందించాల్సి ఉండగా కొంత మంది వంకరగాళ్లు మిగిలిన వాటిని తెల్లారి కూడా అమ్మేస్తున్నారు. కర్రీ పఫ్‌లలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేక్‌లు సైతం చెడిపోయినవి అందిస్తున్నారు. గిరాకీ లేక అమ్మకం కానటువంటి కేక్‌లను డీప్ ఫ్రిజ్జుల్లో దాచి అమ్మేస్తుండటంతో నాణ్యత లోపిస్తున్నది. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు తరచూ తనిఖీలు చేపడితే బేకరీల్లో వక్రమార్గాలు అన్నీ సక్రమంగా జరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ ఇటువైపే వారు కన్నెత్తి చూడటం లేదు. వీరికి తోడుగా మున్సిపల్ సిబ్బంది సైతం పట్టించుకోవడం లేదు. అడపా దడపా తనిఖీలు చేయడం ద్వారా బేకరీ, హోటళ్ల నిర్వాహకులకు భయం ఉంటుంది. తనిఖీలు నామ మాత్రంగానే జరుగుతుండటంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.
పలు బేకరీల్లోనూ అస్తవ్యస్థ పరిస్థితులు తాండవిస్తున్నాయి. చూపునకు బేకరీలు ముందు నుంచి అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ వాటి తయారీ కేంద్రాలు మాత్రం కంపు కొడుతున్నట్లుగా తెలుస్తోంది. వీటిపై మున్సిపల్ అధికారులు, ఆహార కల్తీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఫుడ్ సేప్టీ దాడుల్లో ఎక్కువగా హోటల్లు, రెస్టారెంట్లే ఉండగా తినుబండరాల దుకాణాలు, బేకరీలు, స్వీట్ షాపుల్లో మాత్రం తనిఖీలు చేపట్టకపోవడం విమర్శళకు తావిస్తోంది. స్వీట్ హౌస్‌లలో మిఠాయిలకు గడువు అన్నదే ఉండటం లేదు. ఫులాంగ్ దారిలో గల ఓ స్వీట్ షాపులో బొద్దింక బయట పడటం ఇందుకు ఉదాహారణగా నిలుస్తోంది. ఈ విషయంపై తీవ్ర ఘర్షణ జరుగగా బీజేపీ ప్రజా ప్రతినిధి ఒకరు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిపించారని తెలిసింది. ఠాణా మెట్లు ఎక్కని, ఫిర్యాదుల వరకూ చేరని అనేక ఘటనలు తిను బండారాల దుకాణాల్లో, రెస్టారెంట్, హోటళ్లలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. బేకరీల్లో కాలం చెల్లిన సాస్‌లు అందిస్తున్నారు. సాస్ డబ్బాలు కనీసం కడగటం లేదు. వాటి చుట్టూ మురికి పేరుకు పోతున్నప్పటికీ శుభ్రం చేయకుండానే వాటిని కస్టమర్లకు అందిస్తున్నారు. కొంత మంది సాస్‌లను ప్రత్యేకంగా చిన్నపాటి ప్యాకెట్లు అందిస్తుండగా మరికొంత మంది అపరిశుభ్రంగానే ఆహార పదార్థాలను సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మచ్చుకు ఒకటి రెండు చోట్ల దాడులు చేయడం కాకుండా నిరంతరం తనిఖీలు చేపట్టి స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారం ప్రజలకు అందే విధంగా చూడాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలంతా కోరుతున్నారు. అప్పుడే హోటళ్లు, రెస్టారెంట్, బేకరీ నిర్వాహకుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నారు.
గతేడాదిలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హల్చల్ చేశారు. వారానికి ఒకసారి ఒక్కో హోటళ్లలో దాడులు నిర్వహించి నిల్వ చేసిన మాంసపు ముద్దలను, కల్తీ పదార్థాలను, చెడిపోయిన ఆహారాన్ని గుర్తించారు. రెస్టారెంట్ యజమానులపై జరిమానాలు విధించారు. మూడు నెలలుగా అధికారుల తనిఖీలు పత్తా లేకుండా పోవడం వీస్తూ గొల్పుతోంది. మధ్యలో నిజామాబాద్ నగరపాలక సంస్థ సిబ్బంది తనిఖీలు చేపట్టి మమ అనిపించగా వారు కూడా పర్యవేక్షణను పడకేయించడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. హోటల్, రెస్టారెంట్లలో అకస్మాత్తుగా నిర్వహించాల్సిన తనిఖీలు నిలిచి పోవడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయా హోటళ్ల యజమానులను బెదిరించేందుకు ఇదంతా చేశారా? అని జనాలు అడుగుతున్నారు. వారి చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి మామూళ్ల మత్తులో ఇప్పుడు జోగుతున్నారని విమర్శిస్తున్నారు. ఆహార తయారీ అన్నది నిరంతర ప్రక్రియ. ఇందులో కల్తీ జరగడం కూడా నిరంతరం కొనసాగుతుంది. దాడులు మందగిస్తే హోటళ్ల యాజమాన్యాల వ్యవహారాలకు అడ్డూ అదుపు ఉండదని నగరవాసులు చెబుతున్నారు. తనిఖీల భయం ఉంటేనే ప్రజలకు నాణ్యమైన భోజనం అందుతుందని అంటున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఇంటికే ఆహారాన్ని తెప్పించుకుంటున్న ఘటనల్లోనూ కల్తీ ఆహారం బయట పడుతోంది. ఆఫర్లు ఎరగా వేసి పలు హోటళ్లలో మురిగిపోయిన బిర్యా నీ, చికెన్ ఐటమ్స్‌ను అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహజంగా రూ.220 వరకూ సింగిల్ బిర్యాని ధర ఉంది. ఆఫర్లలో ఫ్లాట్ 50శాతం డిస్కౌంట్ చొప్పున రూ.120 నుంచి రూ.150 వరకే సింగిల్ బిర్యానీని పలు రెస్టారెంట్లు అందిస్తున్నాయి. ఇందులో పాచిపోయిన పదార్థాలు కలుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.