శక్కర్ నగర్ : అధికారంలోకి రాగానే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శంకర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఎన్డీఎస్ఎల్ (NDSL worker) కార్మికుడు సూరజ్ ప్రసాద్ ఆర్థిక సమస్యలతో ( Financial problems ) అనారోగ్యానికి గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
ఫ్యాక్టరీ మూతపడిన నాటి నుంచి వేతనాలు లేక, ఆర్థిక ఇబ్బందులతో సదరు కుటుంబం ఇబ్బంది పడుతుందని ఫ్యాక్టరీ మజ్దూర్ సభ (Masdoor Sabha) యూనియన్ ప్రధాన కార్యదర్శి పి ఉపేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల కార్మికులు ఆకలి చావులకు గురికావాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
ఎన్డీఎస్ఎల్ కార్మికుల మృతికి యాజమాన్యం, ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన సూరజ్ ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఫ్యాక్టరీకి చెందిన కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను, ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.