సర్వమత సంరక్షకుడు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో అన్నిమతాలకు సరైన గౌరవం దక్కింది. పండుగలను అధికారికంగా నిర్వహించి ప్రజల మనిషిగా కేసీఆర్ పేరొందారు. గత పాలకులు క్రైస్తవులను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో దుస్తులను పంపిణీ చేశారు. పదేండ్లలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండేలా పాలించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అన్నిమతాలకూ ప్రాధాన్యమిస్తూ ప్రజారక్షకుడిగా నిలిచిన సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెబుతున్నారు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్. నమస్తే తెలంగాణతో పంచుకున్న అభిప్రాయం ఆయన మాటల్లోనే…
జుక్కల్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందింది. తనకు ఈ నియోజకవర్గంతో చాలా సంబంధాలు ఉన్నాయి. పదేండ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలయ్యాయి. నియోజకవర్గంలో 100 గ్రామాలకు రహదారులు, సరైన వంతెనలు లేక రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. అలాంటిది కేసీఆర్ కృషితో నేడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారి వేశాం. వంతెనలు నిర్మించాం. ఇతర జిల్లాలకు జుక్కల్‌కు చాలా తేడా ఉంటుంది. ఇతర జిల్లాలకు సరిహద్దు ప్రాంతాలన్నీ తెలంగాణ జిల్లాలే కావడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుంది. ఇదే జుక్కల్‌కు మాత్రం సరిహద్దులో మహారాష్ట్ర , కర్ణాటక రాష్ర్టాలు ఉండడంతో అక్కడి ప్రభుత్వాలు అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోనే జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలనూ కలుపుతూ రహదారులను వేశారు. విద్యా, వైద్యం, రహదారులు ఇలా అన్ని రంగాల్లో జుక్కల్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నది. అభివృద్ధి పనులే జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే గెలుపునకు నాంది కాబోతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రజల విశ్వాసం చూరగొంటూ, నమ్మకంతో పదేండ్లు పాలించారు. అయనకు కచ్చితంగా దేవుడి ప్రతిఫలం దక్కుతుంది. మూడోసారి సీఎం కావడం ఖాయం. రాష్ట్రంలోని క్రైస్తవులతోపాటు ప్రజలంతా ఆయన పక్షానే ఉన్నారు. అందుకే కేసీఆర్ విజయం సాధిస్తారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కానరాని అభివృద్ధి..పదేండ్లలో కండ్లముందటే కనిపిస్తుంది.
బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించేందుకు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వేలాది కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులే అండగా నిలుస్తాయి. జుక్కల్ నియోజకవర్గం నుంచి నాలుగోసారి హన్మంత్‌షిండే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం. షిండే అందరికీ అందుబాటులో ఉంటూ చిన్నా పెద్ద తేడా లేకుండా అందరితో సౌమ్యుడిగా ఉంటారు. ఇతరులను బాధపెట్టే వ్యక్తి కాదు. అందుకే సీఎం సైతం షిండేను చాలా సౌమ్యుడని పలుమార్లు ప్రసంగాల్లో కొనియాడారు. 2014లో 35వేల మెజార్టీ, 2018లో 35వేల మెజార్టీతో విజయం సాధించిన షిండే ఈసారి ఎన్నికల్లో రెట్టింపు ఓట్లతో విజయం సాధిస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులతో ప్రజలూ సంతోషంగా ఉన్నారు. పింఛన్, దళితబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, కులవృత్తుల వారికి అండ, ఉచిత విద్యుత్ ఇలాంటి మరెన్నో పథకాలను అమలు చేస్తున్నందున రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. క్రైస్తవులు సైతం క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పేదలకు దుస్తులను అందజేస్తున్నారు. రాష్ట్రంలో నూతన చర్చిలు, ప్రహరీల నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత సీఎందే.
ఎస్సీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచిస్తారు. స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధును ప్రవేశపెట్టారు. ఈ పథకాలతో ఆయావర్గాల్లో అర్హులైన వారికి చేయూతనిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషిచేశారు. ప్రభుత్వ సహకారంతో ప్రస్తుతం ఆయావర్గాల ప్రజలు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇలా అన్నిరకాలుగా చేయూతనిస్తూ అందరినీ సమానంగా చూడడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది.
బీఆర్ఎస్ సర్కారు పేదలు, అభాగ్యుల విషయంలో మానవీయకోణం చూపుతుంది. పింఛన్లను రూ.2వేలు చేసింది. మళ్లీ గెలిస్తే వృద్ధులకు రూ.5016, దివ్యాంగులకు రూ.6వేలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, ఎకరానికి రైతుబంధు ద్వారా రూ.16వేలు, రేషన్‌కార్డు ఉన్నవారికి సన్నబియ్యం, ఆరోగ్య బీమా రూ.5లక్షలు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15లక్షల వైద్య సదుపాయం పొందే అవకాశం ఇలా…ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు.