భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇండ్లను ఖాళీ చేయిస్తున్నామని వివరించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అధికారుల అప్రమత్తతపై కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామన్నారు.
నిజామాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు తోడు.. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్నదని పేర్కొన్నారు. వాతావరణ శాఖ విడుదల చేస్తున్న బులెటిన్ ప్రకారం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్నామని వెల్లడించారు. భారీ వానలతో గోదావరిలో వరద పెరుగుతున్నదని, పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు, పురపాలక సంస్థల పరిధిలో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించి వేరే ప్రాంతాల్లోకి మార్చుతున్నట్లుగా చెప్పారు. ప్రధానంగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో కలెక్టర్ వెల్లడించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను గుర్తించడంతో పాటు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన, రోడ్డు భవనాలు, పంచాయతీ రాజ్, పురపాలక, రెవెన్యూ శాఖలతో సమన్వయంతో ముందుకెళ్తున్నట్లుగా వెల్లడించారు.
పని ప్రాంతాల్లోనే ఉద్యోగులు…
వరద ముప్పు నెలకొన్న నేపథ్యంలో కీలకమైన శాఖలకు చెందిన ఉద్యోగులంతా పని ప్రాంతాల్లోనే ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఆయా శాఖల అధికారులకు బాధ్యతలను అప్పగించాం. ముఖ్యంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అనేక చోట్ల ఆలస్యంగా పంటల సాగు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ, ఉద్యానవన శాఖలను అప్రమత్తం చేశాం. రైతులకు సహాయకారిగా వ్యవసాయ విస్తరణాధికారులు అందుబాటులో ఉంటారు. పంట నష్టం సంభవించే పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారు. రైతులు కూడా ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే స్థానిక ఏఈవోలకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో నాట్లు వేసిన ప్రాంతాల్లో మొలకలు మునిగిన పరిస్థితులు అక్కడక్కడా వెలుగు చూశాయి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను సమర్పిస్తారు. వరి పైరు బలంగా కుదురుకుంటున్న వేళ వానలు భారీగా కురుస్తుండడంతో వ్యవసాయశాఖ ప్రమత్తంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో రైతులు పాటించాల్సిన సాగు విధానాలపై ఏఈవోలు అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు.
అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు…
ప్రస్తుత పరిస్థితుల్లో వాగులు, వంకల్లోకి వరద వస్తున్నది. ఇరిగేషన్ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం.. సుమారు వందకు పైగా చెరువులు అలుగు పారుతున్నాయి. చాలా చెరువుల్లోకి నీరు పోటెత్తుతున్నది. వానలు ఇలాగే కురిస్తే మరిన్ని చెరువులు ఒకట్రెండు రోజుల్లోనే మత్తడి దుంకే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులను అలర్ట్ చేశాం. వారంతా చెరువుల కట్టల పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు. భారీ వరదతో కట్టలు తెగే అవకాశం ఉన్నచోట ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులెవరైనా చెరువు కట్టలు ప్రమాదకరమైన పరిస్థితికి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరాం. ఇరిగేషన్ కంట్రోల్ రూమ్‌తో పాటు కలెక్టరేట్లోనూ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 08462 – 220183 నంబర్‌కు ఫోన్ చేసి వానల ద్వారా ఇబ్బందులు తలెత్తితే సమాచారం ఇవ్వొచ్చు. ఇరిగేషన్ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ 08462 – 221403 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తంగా ఉన్నాం. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపడుతున్నాం. గతేడాది గోదావరి నదిలో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తినప్పుడు కొంత మంది గొర్ల కాపరులు వరదలో చిక్కుకున్నారు. ప్రస్తుతానికి ఎస్సారెస్పీ గేట్లు ఎత్తే అవకాశం లేకపోయినప్పటికీ.. దిగువ ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ శాఖలను అప్రమత్తం చేసి ప్రజలను అటువైపు వెళ్లకుండా చూడాలని చెప్పాం.
కరెంట్ స్తంభాలను ముట్టుకోకండి..
భారీ వానల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు,, తీగలను ఎవరూ తాకవద్దని ప్రజలను కోరుతున్నాను. వానాకాలం నేపథ్యంలో ప్రమాదకరమైన పరిస్థితిని కొని తెచ్చుకోవద్దు. తెగిన తీగలు మీకు ఎదురైతే సమాచారం ఇవ్వండి. తక్షణం ఎన్పీడీసీఎల్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మరమ్మతులు చేస్తారు. విద్యుత్ ప్రమాదాలపైనా ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాం. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నది. ప్రజలెవ్వరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జారీ చేసిన సూచనలు, జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని కోరుతున్నాను. నిజామాబాద్, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీల్లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశాం. పురపాలక శాఖ కమిషనర్లు ఈ మేరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చెరువులు, వాగులు, వంకలు, నదుల్లో వరద భీకరంగా ప్రవాహాన్ని అందుకుంటున్న సమయంలో ఎవ్వరూ అందులో దిగేందుకు సాహసం చేయవద్దని కోరుతున్నాను. ఈత వచ్చినప్పటికీ సాహసం చేయకూడదు. తద్వార ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.