ఖలీల్వాడి, డిసెంబర్ 6 : ప్రముఖ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలు ఒకే వేదికపైకి రానున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వెహికిల్స్ ఇందూరులో సందడి చేయనున్నాయి. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఆటో షో ఇందుకు వేదిక కానున్నది. ఔత్సాహిక కొనుగోలుదారులందరికీ అన్ని రకాల వాహనాలను ఒకే వేదికపై అందించాలన్న ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ గత మూడేండ్లుగా దిగ్విజయవంతంగా ఆటో షోను నిర్వహించింది.
ప్రజల స్పందనను స్ఫూర్తిగా తీసుకుని మరోసారి వాహన ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. రెండ్రోజుల పాటు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్న ఈ ఆటో షోకు వచ్చే సందర్శకులకు ప్రవేశం ఉచితం. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటు వాహనదారుల అభిరుచికి అనుగుణంగా మార్కెట్లోకి వస్తున్న అధునాతన వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు.
అలాగే, వాహనాల కొనుగోలుకు అవసరమైన లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా ఇక్కడ కొలువుదీరనున్నాయి. కియా, మారుతి, నిస్సాన్, హ్యుండాయ్, నెక్సా, టాటా, రాయల్ ఎన్ఫీల్డ్, హీరో, హోండా, టీవీఎస్, ఏథార్, చేతక్ తదితర కంపెనీలు షోలో పాల్గొంటున్నాయి. యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సందర్శకుల కోసం ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేశాయి.