ఇందూరు, అక్టోబర్ 10 : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లలో భాగంగా నూతన కలెక్టరేట్ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. నగరంలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబర్ (08462-220183)కు ఫోన్ చేయాలన్నారు. పరీక్షా కేంద్ల్రాల్లో డ్యూయల్ డెస్క్ టేబుళ్లు, కుర్చీలతో పాటు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేంద్రాల్లో ఏఎన్ఎం, ఆశవర్కర్లను నియమించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సుదర్శనంను ఆదేశించారు. పరీక్షా సమయాలకనుగుణంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్ఎం ఉషాదేవికి, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్‌కు సూచించారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.
ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించుకొని పరీక్షల నిర్వహణ, నిబంధనలపై అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవాలని, సీసీ కెమెరా రికార్డింగ్ నడుమనే ప్రశ్నపత్రాల సీల్ విప్పాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ స్కాడ్, 7 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీఐఈవో రఘురాజ్, డీఈవో దుర్గాప్రసాద్, డీటీసీ వెంకటరమణ ఆర్డీవో రవి, ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.