నిజాంసాగర్, ఫిబ్రవరి 15: నిజాంసాగర్ మండలంలో రూ.476కోట్లతో నిర్మిస్తున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు 15శాతం మాత్రమే పూర్తయ్యాయని, త్వరితగతిన పూర్తిచేస్తే జుక్కల్ నియోజకవర్గంలోని 41వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడారు. నిజాంసాగర్, కౌలాస్నాలా ప్రాజెక్టుల ద్వారా 13,500 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని, 30ఏండ్ల కిందట ప్రారంభించిన లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.223కోట్లు విడుదల చేసినప్పటికీ పనులు నిలిచిపోయాయని తెలిపారు.
లెండి పూర్తయితే 25వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందని, కౌలాస్నాలా మెయింటెనెన్స్కు నిధులు మంజూరు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రిని కోరారు. జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో 28 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉంటే 18మంది మాత్రమే పని చేస్తున్నారని, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. బిచ్కుందలో వంద పడకల దవాఖాన ప్రారంభించినా ఒక్క మెడికల్ ఆఫీసర్ లేరని తెలిపారు.