బాల్కొండ : కామ్రేడ్ కర్నాటి యాదగిరి జిల్లాలో రైతు కూలీ సంఘాలు, జీతగాళ్ల సంఘాలు, బీడీ కార్మిక సంఘాలు ఇలా అనేక సంఘాలు ఏర్పాటు చేసి వారి హక్కుల సాధన కొరకు నిరంతరం పోరాటాలు నడిపారని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(TUCI) రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న అన్నారు. జీజే బీడీ సెంటర్ కిసాన్ నగర్ ఆఫీస్ ముందు కర్నాటి యాదగిరి సంతాప సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరి బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అలుపెరుగని పోరాటం చేశాడన్నారు. ఆయన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన చూపిన బాటలోనే ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు తూర్పాటి శ్రీనివాస్, ఎన్.నిఖిల్, ఉమేష్, వినోద్, చిన్న దాసు, సునీల్, దినేష్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.