నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 26: తనకు తెలియకుండా వెయ్యి రూపాయలు తీసుకున్నాడనే కోపంతో బాబాయ్ కొడుకునే కత్తితో పొడిచి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకోగా వివరాలను ఏసీపీ వెంకటేశ్వర్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చిన్నరాంపూర్ గ్రామానికి చెందిన షేక్ సమీయొద్దీన్ (24), అతడి బాబాయ్ కొడుకు వసీమొద్దీన్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలదుకాణంలో పనిచేశారు. రెండేండ్ల క్రితం మర్చంట్ యజమాని వద్ద పని చేయడానికి వసీమొద్దీన్ రూ.45వేలు అడ్వాన్స్‌గా తీసుకొని, కొద్దిరోజులకు పనిమానేశాడు. తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలని యజమాని ఫోన్ చేసి అడగడంతో ఈ నెల 24న డబ్బులు తీసుకొని వసీమొద్దీన్, షేక్ సమీయొద్దీన్ కలిసి బైక్‌పై నిజామాబాద్‌కు వచ్చారు. వసీమొద్దీన్ వర్నిరోడ్డు వద్ద ఉండగా, సమీయొద్దీన్ వెళ్లి యజమానికి రూ. 44వేలు చెల్లించివచ్చాడు. అనంతరం వారి స్నేహితుడు అలీమ్‌తో కలిసి మద్యం సేవించారు. కొద్దిసేపటికి యజమాని ఫోన్ చేసి తనకు సమీయొద్దీన్ రూ.44 వేలు ఇచ్చాడని, వేయి రూపాయలు తక్కువగా ఇచ్చాడని చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన వసీమొద్దీన్ తన వద్ద ఉన్న కత్తితో సమీయొద్దీన్ను పొడిచి చంపాడు. త్రీటౌన్‌లో కేసు నమోదుచేయగా సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై భాస్కరా చారి తన సిబ్బంది తో కలిసి నిజాంసాగర్ బస్‌స్టాండ్‌లో నిందితుడు వసీముద్దీన్ను అదుపులోకి తీసుకొన్నారు. విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడని ఏసీపీ వివరించారు. నిందితుడి వద్ద నుంచి కత్తి, బైక్ తో పాటు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అతడిపై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన సీఐ కృష్ణ, ఎస్సై భాస్కరా చారి, సిబ్బంది ఎండీ అఫ్సర్, షౌకత్ అలీ, బి.అనిల్‌ను సీపీ నాగరాజు అభినందించారు.