వినాయక్‌నగర్, నవబంర్ 3: కాంగ్రెస్‌ను ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ పుణ్యక్షేత్రాలపై ఒట్టు వేసి ఇప్పుడు ఆ ఒట్టును గట్టుమీద పెట్టి రైతులను నట్టేటా ముంచిందని మండిపడ్డారు.
ప్రజలకు అమలుకాని హామీలు ఇవ్వకూడదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. జిల్లాలో 468 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇకనైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఇప్పటి వరకు తన లెటర్‌ప్యాడ్ ప్రింట్ చేయించుకోలేదని, మంత్రి పదవి వచ్చాకే చేయించుకుంటాడేమోనని ఎద్దేవా చేశారు.