నిజామాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూడు రోజుల క్రితం కమ్మర్‌పల్లికి చెందిన ఓ పసుపు రైతుకు క్వింటాలుకు రూ.10వేలు ధర దక్కింది. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు ఉత్పత్తులు తీసుకు వచ్చిన సదరు రైతుకు దక్కిన గిట్టుబాటుతో రైతులంతా సంతోషించారు. రూ.15 వేలు గిట్టుబాటు ఆశించిన చోట కనీసం పది వేలు అయినా దక్కిందని సంబురపడ్డారు. ఇదే అదనుగా జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో ఒకే తీరులో ప్రచారం చేశాడు. భారతీయ జనతా పార్టీ మరో అడుగు ముందుకేసి పసుపు రైతులకు బాసటగా కేంద్ర ప్రభుత్వం అంటూ బాకాలు ఊదింది. ఈ ప్రచారాన్ని నమ్మిన పసుపు రైతులు ఇదే మంచి సమయం అనుకుని ఉత్పత్తులను తీసుకుని నిజామాబాద్‌కు వచ్చారు. రెండు రోజులుగా భారీగా పసుపుతో వస్తే డిమాండ్ పలుకుతున్న ధర మాత్రం బీజేపీ చెబుతున్న మాటలకు విరుద్ధంగా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే జవాబిచ్చే నాథుడు కరువు. మండే ఎండలో పసుపు రైతులంతా మంచి ధర కోసం వేచి చూస్తున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. వందలో ఒకరికి మాత్రమే దక్కుతున్న ధరను మార్కెట్ మొత్తానికి ఆపాదిస్తూ బీజేపీ రాజకీయం చేయడంపై రైతన్నలు కన్నెర్ర చేస్తున్నారు.
పసుపు రైతులకు ఈ సీజన్లో ఎదురవుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్‌కు పసుపు రాక ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు క్వింటాలుకు దక్కుతున్న ధర ఘోరంగా ఉంటున్నది. గతేడాది కనీసం రూ.7వేలకు పైగా ధర పలికిన క్వింటాలు పసుపు ఇప్పుడు దయనీయంగా మారింది. గురువారం నిజామాబాద్ మార్కెట్లో చాలా మంది రైతన్నలకు దక్కిన గిట్టుబాటు ధర రూ.4,644 మాత్రమే. కొంత మందికి రూ.5,655 చొప్పున లభించింది. అంతేకానీ రూ.10వేల వరకు పసుపు అమ్ముడైన దాఖలాలే కనిపించడం లేదు. మార్కెట్లో నమోదవుతున్న ధరలకు బీజేపీ చేస్తున్న ప్రచారానికి పొంతనే ఉండడంలేదు.తాను ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటు, క్వింటాలు పసుపుకు రూ.15వేలు మద్దతు ధరను కల్పిస్తానని అర్వింద్ హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చలేకపోవడంతో రైతుల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ప్రకటనలు చేయిస్తున్నారని రైతులు భావిస్తున్నారు. ఎంపీ వర్గీయులు చేసే అబద్ధపు ప్రచారంతో చాలా మంది దూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వచ్చి అవాక్కవుతున్నారు. నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు రాక వేగంగా కొనసాగుతోంది. కుప్పలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రూ.10వేలు పలుకుతున్న రైతులంతా ఓ రాజకీయ పార్టీకి చెందిన సానుభూతిపరులని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి లాభం చేకూర్చేందుకే ఒక్కరికి దక్కే ధరను అందరికీ వర్తించిందనే రీతిలో మాట్లాడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
నిజామాబాద్‌సిటీ, ఫిబ్రవరి 24: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. బుధవారం రాత్రి వరకు సుమారు 12వేల క్వింటాళ్ల పసుపు వచ్చినట్లు మార్కెట్‌యార్డు అధికారులు ప్రకటనలో తెలిపారు. మన జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిర్మల్, మహారాష్ట్ర నుంచి రైతులు పసుపు పంటను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. క్వింటాలుకు సుమారు రూ. 4వేల నుంచి ఆరువేల ధర పలుకుతుందని తెలిపారు.
పసుపు పంట సాగులో ఇప్పుడు లాభం కన్నా నష్టమే ఎక్కువైతుంది. మంచి ధర వచ్చిందని చెబుతున్నారు. ఇక్కడికి వస్తే అంతగానం దక్కడం లేదు. క్వింటాలుకు 5వేలు ఇస్తేనే ఎక్కువన్నట్లుగా పరిస్థితి మారింది. పసుపు పంటకు క్వింటాలు రూ.10వేలు దక్కుతుందని చెబుతున్నదంతా ఉట్టిదే. అందుకు నేనే నిదర్శనం. నేను తెచ్చిన పసుపు పంటకు క్వింటా ధర రూ.4,644 మాత్రమే దక్కింది. ఇదేందని అడిగితే స్పందన లేదు.
– చెరుకు ముత్తెన్న, పసుపు రైతు, కోటార్మూర్
ఎంపీ ధర్మపురి అర్వింద్ నెలకోసారి జిల్లా పర్యటనకు ఇలా వచ్చి అలా వెళ్తుంటారు. వచ్చినప్పుడల్లా పసుపు క్వింటాలు ధర రూ.10వేలు దాటిందంటూ ఘనంగా చెబుతుంటారు. పక్కనే మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర తన వల్లే పలికిందని గొప్పలకు పోతుంటారు. వాస్తవానికి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన పసుపు రైతులు తమ పంటను నిజామాబాద్ మార్కెట్‌కు మాత్రమే తెస్తారు. శ్రద్ధానంద్ గంజ్‌లోనే పసుపును విక్రయిస్తారు. సాంగ్లీ మార్కెట్‌కు రవాణా మార్గం ఉన్నప్పటికీ అదనపు ఖర్చు వెచ్చించి పంటను విక్రయించుకునేంత అవకాశం మన రైతులకు లేదు. పోనీ సాంగ్లీ మార్కెట్‌కు చేరాలంటే నిజామాబాద్ నుంచి దాదాపుగా 428 కిలో మీటర్లు దూరభారం తప్పదు. గంటల కొద్దీ ప్రయాణంలో రోజులు మారితే ధరలోనూ తేడాలు వచ్చే అవకాశం ఉంది. బడా వ్యాపారులు, బ్రోకర్లకు తప్ప రైతులకు సాంగ్లీ మార్కెట్‌తో ఒనగూరే ప్రయోజనం సున్నా. కానీ మాటిమాటికీ ఎంపీ అర్వింద్ మాత్రం సాంగ్లీ ప్రస్తావన తెస్తూ రైతుల్లో ఆశలు రేకెత్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేను 40 ఏండ్ల నుంచి పసుపు పంటను సాగు చేస్తున్నా. మూడేండ్ల నుంచి ఎదురవుతున్న పరిస్థితి గతంలో ఎప్పుడు సూడలేదు. రూ.15వేలు మద్దతు ధర కల్పిస్తామని బీజేపీ నాయకులు చెప్పారు. ఇప్పుడు మాట మారుస్తుండడం మంచి ది కాదు. నిజామాబాద్ మార్కెట్లో రూ.4,500 నుంచి రూ.5,500 మించి ధర వస్తలేదు.
-పోశన్న, పసుపు రైతు