కంటేశ్వర్ : నిజామాబాద్ ఎంపీ అరవింద్ ( MP Aravind ) అహంకారపు మాటలు మానుకోవాలని , లేనిపక్షంలో ఊరురా తరిమికొడతామని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (Taher Bin Handan) , నుడా చైర్మన్ కేశవ వేణు ( Kesa Venu ) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.
ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో నిజాంసాగర్‌లో జవహర్ నవోదయ ( Navodaya ) పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కేంద్ర ప్రభుత్వం మరో నవోదయ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని వివరించారు. అయితే స్థల పరిశీలన విషయంలో నిర్ణయం ఇంకా తీసుకోలేదని వివరించారు. విద్యార్థులకు అందుబాటులో ఉండేవిధంగా స్థల సేకరణ కొనసాగుతుందని తెలిపారు.
నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని మొదటి ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీగా గెలిచిన అరవింద్ ఇప్పటివరకు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీని, యూనివర్సిటీని తీసుకువచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డిదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నందిపేట్‌లో 450 ఎకరాలు సెజ్ కు ఇస్తే అరవింద్ ఆరు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క ఇండస్ట్రీని తీసుకురాలేదని ఆరోపించారు. జిల్లాలో మూడు రైల్వే ఫ్లైఓవర్లు 10 సంవత్సరాలుగా నత్తనడకన నడుస్తున్నాయని పేర్కొన్నారు.
సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్ధి పై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎంపీగా జిల్లాలో ఒక్క నియోజకవర్గానికి కూడా నాలుగు లైన్ల రోడ్డు తీసుకురాలేదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే ఆలోచనలో ఉండడంతో అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నాయకులపై అబద్ధపు వాదనలు చేస్తున్నాడని విమర్శించారు.
కేశ వేణు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ముఖం చూసి అరవింద్‌కు ఓటర్లు వేశారే తప్పా ఆయనను చూసి కాదని వెల్లడించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గోపి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, సకినాల శివ కుమార్, జగడం సుమన్, తదితరులు పాల్గొన్నారు .