Kamareddy | వినాయక నగర్, డిసెంబర్ 20: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో హృదయ విదారక ఘటన శనివారం వెలుగు చూసింది. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కన్నతల్లి మరొకరికి విక్రయించింది. స్థానికుల ద్వారా ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఒకటో టౌన్ ఎస్హెచ్వో బీ రఘుపతి దర్యాప్తు నిర్వహించి బాలుడి విక్రయ కేసును ఛేదించారు. ఎస్హెచ్వో కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన సీమ అనే మహిళ షరీఫ్ అనే వ్యక్తి తో సహజీవనం సాగిస్తుంది.
గత కొంతకాలం క్రితం సదరు మహిళ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఉంటూ భిక్షాటన చేసుకుంటుంది. సీమ అనే సదరు మహిళకు 9 నెలల బాబు ఉన్నాడు. వీరికి కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లపల్లి ప్రాంతానికి చెందిన రెహానా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ మహిళ తనకు తెలిసిన వారికి మగ సంతానం లేదని వారు బాబుని కొనాలనుకుంటున్నారని మధ్యవర్తిగా వ్యవహరించింది. ఆమె మాటలకు అంగీకరించిన సీమ, షరీఫ్ కలిసి 9 నెలల బాబుని రూ.1.20లక్షకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో నగరంలోని ముజాహిద్ నగర్ కు చెందిన సలహుద్దీన్ అనే వ్యక్తి మధ్యవర్తి మహిళ సహాయంతో డబ్బులు చెల్లించి బాబుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే రైల్వే స్టేషన్ ప్రాంతంలో సీమ, షరీఫ్ వద్ద ఉన్న తొమ్మిది నెలల బాబు గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం కలిగి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉండే ఇతర భిక్షాటకులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి దర్యాప్తు నిర్వహించి బాలుడిని విక్రయించిన సీమ, షరీఫ్ లతో పాటు మధ్యవర్తి రెహానా, బాలుని కొనుగోలు చేసిన సలహుద్దీన్ నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.