భిక్కనూరు, డిసెంబర్ 8: ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన మండలంలోని 44నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడకు చెందిన కంచర్ల నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి బాన్సువాడకు కారులో బయల్దేరారు. ఈ క్రమంలో భిక్కనూరు శివారులో జాతీయ రహదారిపై ఎలాంటి ఇండికేషన్ లేకుండా ఆగి ఉన్న నాగాలాండ్‌కు చెందిన ఓపెన్ ట్రైలర్ లారీని పొగమంచు కారణంగా కారు ఢీకొన్నది.
ఈ ఘటనలో కారు లారీ కిందికి చొచ్చుకు పోయింది. దీంతో కారు నడుపుతున్న అక్షయ్‌రెడ్డి(28) అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో లక్ష్మి, రాజేశ్వర్, భూమవ్వకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ లక్ష్మి(49) మృతిచెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎలాంటి ఇండికేషన్ లేకుండా రోడ్డుపై లారీని నిలిపినందుకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
బాన్సువాడ, డిసెంబర్ 8: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందడంతో పాత బాన్సువాడలో విషాదం నెలకొన్నది. బాన్సువాడకు చెందిన మాజీ సర్పంచ్ కొర్ల సంగారెడ్డి కూతురు లక్ష్మి, ఆమె కుమారుడు అక్షయ్‌రెడ్డి ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలుసుకున్న పలువురు బాధిత కుటుంబం ఉండే ఇంటికి తరలివచ్చారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పలువురు నాయకులు ఉన్నారు. పుట్టిన రోజునే అక్షయ్‌రెడ్డి మృతిచెందడంతో మిత్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్షయ్ అందరితో కలుపుగోలుగా ఉండేవాడని స్నేహితులు తెలిపారు.