నిజామాబాద్, నవంబర్ 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన చెందుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏటా ఆలస్యంగా సెంటర్లు ప్రారంభిస్తుండటంతో రైతులకు నష్టాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు కేంద్ర సర్కారు తీరుతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఓ వైపు 8-12శాతం తేమ నిబంధనలకు తోడుగా స్లాట్ బుకింగ్ ఉంటేనే కొనుగోళ్లు చేస్తామంటూ ఖరాకండిగా చెబుతుండటం రైతులను ముచ్చెమటలు పట్టిస్తోంది. మరోవైపు ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు చేస్తామని చెబుతుండటంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. మిగిలిన పత్తిని ఎవరికి అమ్ముకోవాలని అడుగుతున్నారు. తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతు నుంచి మొత్తం పత్తిని సేకరించకపోవడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. స్లాట్ బుకింగ్ విషయంపై అవగాహన కల్పించడంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మొద్దు నిద్ర అవలంభిస్తోంది. రైతులకు సహాయకారిగా ఉండాల్సిన ఏఈవోలు, ఏవోలు ఇతరత్రా విధుల్లో ఉండటంతో అందుబాటులోకి రావడం లేదు. వెరసి పత్తి రైతు ఈసారి కూడా చిత్తవుతున్నాడు. కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వ్యాపారస్తులు గద్దల్లా వాలిపోయి అందిన కాడికి దోచుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం పట్టనట్లు వ్యహరిస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో పత్తి ఇప్పటికీ చేనులోనే ఉండిపోయి దెబ్బతింటోంది. నానా కష్టాలు పడి తీసిన పత్తిని అమ్ముకునేందుకు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడంతో మరింత అవస్థలు తప్పడం లేదు. అక్టోబర్ 30న ప్రారంభిస్తామని అధికార యంత్రాంగం చెప్పగా వర్షాల కారణంగా వాయిదా వేసి నవంబర్ 3న మద్నూర్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రానికి తీసుకు రావడానికి ముందు కపాస్ కిసాన్ యాప్‌లో వ్యవసాయ అధికారులు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరమే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కపాస్ కిసాన్ యాప్‌లో ముందుగానే పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళా స్లాట్ బుకింగ్ చేసుకున్న తేదీ రోజున అనివార్య కారణాలతో పత్తిని అమ్ముకోవడానికి రాకపోతే తిరిగి అదే రోజు స్లాట్ బుకింగ్ రద్దు చేసుకోవాలి. ఇలా మూడు పర్యాయాలు మాత్రం స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఉండదు. ఒక వేళా మూడు స్లాట్ బుకింగ్‌లలో పత్తిని అమ్ముకోలేని రైతుల పరిస్థితి గందరగోళంలోనే పడనుంది. నిర్ధేశిత తేమ శాతం పేరుతో రైతులకు ఇక్కట్లు దాపురిస్తున్నాయి. దూదిలో తేమ శాతం 8 ఉంటే క్వింటాకు రూ.8110 చెల్లిస్తున్నారు. అంతకు మించితే ఒక్కో శాతానికి రూ.81 చొప్పున కోత పెడుతున్నారు. స్లాట్ బుక్ చేసుకుని తీసుకు వచ్చే పత్తిలో 12శాతం లోపు తేమ ఉంటేనే కొంటున్నారు. దాటితే తిరిగి పంపిస్తున్నారు. తేమ విషయంలో వెసులుబాటు కల్పించాలని రైతులు కోరుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
కామారెడ్డి జిల్లాలో మద్నూర్ మార్కెట్ కమిటీ ఆధీనంలో 7 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వీటినే సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవాలంటే రైతులు నేరుగా రావడానికి వీల్లేదు. స్లాట్ బుకింగ్ ద్వారా సీసీఐ కొనుగోలు కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. జిన్నింగ్ మిల్లు సామర్థ్యం ప్రకారమే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్‌లు ఆధారపడి ఉంటుంది. సీసీఐ ద్వారా పత్తిని అమ్ముకునే రైతులు పత్తిలో తేమ 8శాతం నుంచి 12శాతం వరకు మించి ఉండరాదు. పత్తి పింజ రకాన్ని అనుసరించి రూ.50 వరకు మద్ద తు ధరలో కోత విధించడం తప్పదు. అలాగే తేమ శాతాన్ని అనుసరించి రూ.81 వరకు కోత విధించనున్నారు. పత్తి అమ్ముకునేందుకు సిద్ధమైన రైతులు పత్తిని తమ కల్లాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకు రావాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చెబుతోంది. సీసీఐ కేంద్రానికి అధిక తేమ శాతంతో పత్తిని తీసుకుని వస్తే రైతులు ఇబ్బంది పడతారని హెచ్చరిస్తోంది. పత్తి రైతును ప్రకృతితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పగ బట్టాయి. మే నెలలోనే వర్షాలు కురవడంతో ముందస్తుగానే పత్తిని రైతులు విత్తుకున్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారుగా 30వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. తీరా ఎదుగుదలకు వచ్చే సమయంలో వర్షం ముఖం చాటేసింది. దీంతో ఆశించిన మేర మొక్క ఎదగలేదు. పంట చేతికొచ్చే సమయానికి ఎడతెరిపిలేని వర్షాలకు తోడుగా కూలీల కొరత రైతులను ముప్పు తిప్పలకు గురి చేస్తోంది.
పత్తికి మద్దతు ధర రూ.10వేలు ఉంటే రైతులకు కొంతమేర గిట్టుబాటు అవుతుంది. ఏడాదికి ఒకే పంట కావడంతో క్వింటాలుకు రూ. పదివేలు ఉండాలి. పత్తికి పెట్టుబడి సైతం ఎక్కువగా ఉంటుంది. ధర మరో రెండు వేలు ఎక్కువగా ఉండే విధంగా సీసీఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-దత్తు, రైతు, మద్నూర్
సీసీఐ వారు ఎకరం భూమికి 12 క్వింటాళ్లవరకు కొను గోలు చేయాలి. గతేడాది 12 క్వింటాళ్లు కొనుగోలు చేసి న అధికారులు, ప్రస్తుతం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అందు వల్ల పాత పద్ధతి ప్రకారం ఎకరానికి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి.
-నాగేశ్, రైతు, మద్నూర్
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాము. మొత్తం 7 జిన్నిం గ్ మిల్లులోనే కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాము. సీసీఐ నిబంధనల మేరకు 8-12 శాతం తేమ ఉంటేనే కనీస మద్ధతు ధర వర్తిస్తుంది. రైతు పండించిన మొత్తం పత్తి కాకుండా ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే సేకరిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నాము.
– రమ్య, కామారెడ్డి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి