మోదీ సర్కారు మళ్లీ మొండిచేయి చూపింది. బోధన్-బీదర్ రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించకుండా మరోమారు వివక్షను ప్రదర్శించింది. నిజాం కాలం నుంచి ప్రతిపాదనలో ఉన్న బోధన్-బీదర్ రైల్వే లైన్ అంశం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కార్యరూపం దాల్చలేదు. ఈ రైల్వే లైన్ పూర్తయి ఉంటే బోధన్, జుక్కల్ నియోజకవర్గాలకు కనెక్టివిటీ పెరిగి ఎంతో అభివృద్ధి జరిగేది. రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ పిట్లం, నారాయణఖేడ్ వంటి మారుమూల ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరేది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ రైల్వే లైన్‌ను పట్టించుకోలేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆశలు చిగురించాయి. 2014లోనే సర్వే ప్రక్రియ పూర్తి చేసిన రైల్వే శాఖ మోదీ సర్కారుకు నివేదిక అందించింది. అప్పుడే నిధులు కేటాయిస్తే ఇప్పటికే రైళ్లు కూత పెట్టేవి. కానీ, సర్వే పూర్తయి తొమ్మిదేండ్లు అవుతున్నా కేంద్రం రూపాయి ఇవ్వలేదు. తాజా బడ్జెట్లోనూ పైసా కేటాయించలేదు. జిల్లా ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన ఎంపీ అర్వింద్ స్పందించడమే లేదు. రైల్వేలైన్‌తో పాటు పసుపుబోర్డు అంశంపై పార్లమెంట్లో ఒక్కసారి కూడా లేవనెత్తక పోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– బోధన్, జనవరి 3
బోధన్, జనవరి 9 : నిజాంపాలన నాటికే ప్రతిపాదనలో ఉన్న బోధన్-బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ రైల్వేలైన్‌ను నాటి పాలకులు పట్టించుకోలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ రైల్వేలైన్‌పై మళ్లీ ఆశలు చిగురించాయి. అప్పటికే ఈ రైల్వేలైన్ సర్వే పూర్తికావడంతో.. ఇక నిధుల మంజూరే తరువాయి అన్న భావన ఏర్పడింది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఈ బోధన్ – బీదర్ రైల్వేలైన్‌కు నిధులు కేటాయిస్తుందని కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రతిసారీ జిల్లా ప్రజలు ఆశిస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 1న పార్లమెంట్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సైతం ఈ రైల్వేలైన్ ఊసే లేకపోవడం నిరాశను కలిగించింది.
జిల్లా సమగ్ర పారిశ్రామికాభివృద్ధి, ప్రధానంగా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఎంతగానో ఉపయోగపడే అతి ముఖ్యమైన రైల్వేలైన్ల ఏర్పాటు లో కేంద్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లాలో రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధవహించకపోవడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.బోధన్-బీదర్ రైల్వేలైన్‌కు నిధులు సాధించేందుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అతి ముఖ్యమైన ఈ రైల్వేలైన్ విషయమై పార్లమెంట్లో ఒక్కసారి కూడా ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.
కలగా మిగిలిన రైల్వేలైన్
బోధన్ -బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదన దశాబ్దాలుగా కాగితాలు, సర్వేలకే పరిమితమైంది. 1938లో బోధన్ వరకు రైల్వేలైన్ ఏర్పాటయినప్పుడే.. ఈ రైల్వేలైన్‌ను బీదర్ వరకు పొడిగించాలని నాటి నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఈ రైల్వేలైన్ పొడిగింపు ప్రతిపాదన మూలనపడింది. సమైక్యాంధ్రలో పాలకులు ఈ రైల్వేలైన్ నిర్మాణం విషయమై కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాలేదు. 1972లో మరోసారి బోధన్ – బీదర్ రైల్వేలైన్ ఏర్పాటు తెరపైకి వచ్చింది. అప్పట్లో రైల్వేశాఖ ప్రాథమిక సర్వేను నిర్వహించింది. అప్పటి నుంచి అనేకసార్లు ఎన్నికల్లో ఈ రైల్వేలైన్ ఏర్పాటు హామీలకే పరిమితమైంది. చివరికి 2010లో నాడు కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఈ రైల్వేలైన్‌కు ఆమో దం తెలిపారు. రైల్వేలైన్ ఏర్పాటు కోసం 2011 నుంచి రైల్వేశాఖ జియోగ్రాఫికల్ సర్వే నిర్వహించింది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణ్‌ఖేడ్, బీదర్ వరకు ఈ సర్వే జరిగింది. బోధన్ నుంచి బీదర్‌కు 138 కిలోమీటర్ల మేరకు రైల్వేట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ సర్వేలో ప్రతిపాదించారు.
సర్వే ప్రకారం ఈ రైల్వేలైన్‌లో భారీ వంతెనలు లేవని, కేవలం రూ.1,029 కోట్ల తో ట్రాక్ నిర్మాణం చేపట్టవచ్చని సర్వేలో నిపుణు లు అంచనా వేశారు. సర్వే నివేదికను 2014లోనే కేంద్ర ప్రభుత్వానికి రైల్వేశాఖ సమర్పించింది. ఈ సర్వేతో కేంద్రం చేతులు దులుపుకొని, రైల్వే మా ర్గం ఏర్పాటును ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ రైల్వేలైన్ పూర్తయినట్లయితే, బోధన్ పట్టణం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి. మరోపక్క ఉమ్మడి జిల్లాలోని జుక్కల్ నియోజకర్గంలోని వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టవిటీ పెరిగి పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. ఒకపక్క బోధన్ నుంచి బీదర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయకుండా, మరోపక్క కేంద్రంలోని పాలకులు 2019 రైల్వే బడ్జెట్లో మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బీదర్‌కు రైల్వేలైన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించడంతో ఇక బోధన్ – బీదర్ రైల్వేలైన్‌ను పాలకులు పట్టించుకుంటారా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాయలసీమ రైలు పొడిగింపు ఎప్పుడో..
తిరుపతి- నిజామాబాద్ మధ్య నడుస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు పొడిగించాలన్న డిమాండ్‌ను రైల్వేశాఖ పట్టించుకోవడంలేదు. ఆరు నెలలుగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు ట్రయల్‌గా నడుపుతున్నారు. అంతేతప్ప, ప్రయాణికులకు అందులో ప్రయాణం చేసేందుకు అనుమతించడం లేదు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను శుభ్రపర్చేందుకు మాత్రమే బోధన్‌కు వరకు నడుపుతున్నారు.
బోధన్ వరకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని రైల్వే అధికారులు భావించినప్పటికీ, మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే డివిజన్ నుంచి వస్తున్న ఒత్తిడితో ఈ నిర్ణయం అమలుకు నోచుకోవడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదనా రద్దయింది. బోధన్‌కు బదులు ఆ ఎక్స్‌ప్రెస్‌ను నాందేడ్‌కు పొడిగించారు.
జిల్లాకు తీరని అన్యాయం
కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాలోని రైల్వేలైన్లకు తీరని అన్యాయం జరిగింది. కీలకమైన బోధన్ – బీదర్ రైల్వేలైన్‌ను ఈ బడ్జెట్లో పట్టించుకోలేదు. మోదీ సర్కార్ తొమ్మిదేండ్లుగా బడ్జెట్లో ఈ రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం శోచనీయం.. ఇక నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఈ రైల్వేలైన్ కోసం ఎన్నడూ పట్టించుకోలేదు.. జిల్లా రైల్వేల అభివృద్ధి గురించి ఆయనకు పట్టింపులేదు.. అర్వింద్ హయాంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు రైల్వేస్టేషన్లు మూతపడడం సిగ్గుచేటు.. ఇకనైనా ఎంపీ అర్వింద్ నిర్లక్ష్యం వీడాలి..
-ఎం.శివకుమార్, విద్యార్థి జేఏసీ నాయకుడు, బోధన్