కామారెడ్డి/కంఠేశ్వర్, అక్టోబర్ 9: మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్లను ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు బుధవారం ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండానే డీఎస్సీ నియామకాలు చేపట్టడం ద్వారా మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు విమర్శించారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు వెంటనే వర్గీకరణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రేవంత్రెడ్డి.. వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడం, అపాయింట్మెంట్లు ఇవ్వడంతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టే వరకూ ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్ట వద్దని ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి డిమాండ్ చేశారు. వెంటనే వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని, లేకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు లేవదీస్తామని ఆయన హెచ్చరించారు.