ఖలీల్‌వాడి, డిసెంబర్ 27: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత రేపు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ అక్రమ కేసులతో ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న ఎమ్మెల్సీ కవిత ఆదివారం జిల్లాకు రానున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి నిజామాబాద్‌కు చేరకుంటారని, డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతారన్నారు. అనంతరం బైపాస్ రోడ్డ్ మీదుగా సుభాష్‌నగర్ ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఆమె ప్రసంగిస్తారని జీవన్‌రెడ్డి తెలిపారు.