ఖలీల్‌వాడి, నవంబర్ 10 : కాంగ్రెస్ పార్టీ బీసీల టికెట్లను అమ్ముకొని, నాయకుల రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతున్నదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన హస్తం పార్టీ.. ఏనాడూ కులగణనకు ధైర్యం చేయలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క బీసీ నాయకుడికి కూడా టికెట్ ఇవ్వని పార్టీ.. నేడు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆహాస్యాస్పదమన్నారు. రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు లేదన్నారు. నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, బీసీ నాయకులతో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులు రాష్ర్టానికి సేవలందించారని, అయినప్పటికీ స్థానికంగా అభివృద్ధి చేయలేదని గుర్తుచేశారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 8 జనరల్ సీట్లలో కాంగ్రెస్ నాలుగు సీట్లను బీసీలకు కేటాయించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ‘రేటెంత రెడ్డి’ గాంధీ భవన్లో గాడ్సేలా దూరి.. బాన్సువాడలో బీసీ నాయకుడు కాసుల బాల్‌రాజు టికెట్‌ను ధనవంతుడైన ఏనుగు రవీందర్‌రెడ్డికి అమ్ముకున్నాడని విమర్శించారు. ఎల్లారెడ్డి, ఆర్మూర్, బాల్కొండలోనూ ఇతరులకే టికెట్లు ఇచ్చారని తెలిపారు. దాదాపు 10-15 మంది బీసీ నాయకుల రాజకీయ భవిష్యత్తుకు రేటుకట్టి టికెట్లను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేటెంతరెడ్డి’ పోటీ కారణంగా కామారెడ్డి నుంచి మైనార్టీ నాయకుడు షబ్బీర్‌అలీని నిజామాబాద్‌కు తరిమివేశారని అన్నారు. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని, కామారెడ్డి వరకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. కనీసం బాలరాజును పరామర్శించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికలకు ముందే టికెట్లను అమ్ముకున్న వ్యక్తి నడిపించే పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే తెలంగాణను గంప గుత్తగా అమ్మేస్తాడని అన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కాకుండా, ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని, మ్యానిఫెస్టోలో చేర్చని వాటిని కూడా అమలు చేసి చూపించారని కవిత స్పష్టం చేశారు. గొప్ప రాష్ట్రమైన కర్ణాటకలో నేడు నాయకత్వ సంక్షోభం ఏర్పడిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వంటి రాష్ర్టాల్లో పర్యటించేముందు స్థానిక స్థితిగతులను తెలుసుకొని రావాలని సిద్ధరామయ్యకు సూచించారు. బీసీల భావోద్వేగాలను గౌరవిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ ఆదరిస్తున్నదని తెలిపారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ఉమ్మడి జిల్లాతోపాటు పరిసర జిల్లాలూ అభివృద్ధిలో దూసుకుపోతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారని ధ్వజమెత్తారు. బీసీ డిక్లరేషన్ సత్యదూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయడం తప్ప.. వేరే మార్గమే లేదని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కవిత కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే.. అక్కడి సీఎం సిద్ధరామయ్య మన రాష్ర్టానికి వచ్చి పాఠాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ దాదాపు రూ.45వేల కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఇంత పెద్దఎత్తున బీసీ సంక్షేమానికి కృషి చేస్తున్న గులాబీ పార్టీ వైపు ఉంటామా? లేదంటే రాజకీయంగా, విద్యాపరంగా, ఆత్మగౌరవపరంగా అణగదొక్కుతున్న కాంగ్రెస్ పక్షాన ఉంటామా అన్నది ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందన్నారు. 2004లో ఆర్.కృష్ణయ్యను తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, కులగణన చేపట్టాలని కోరినా.. ఒక్క అడుగు కూడా ముందుకువేయని దౌర్భాగ్యమైన పార్టీ కాంగ్రెస్ అన్నారు.