మోర్తాడ్, జనవరి 11: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన నాటి నుంచి ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యాలయాలపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెడుతూ… దాడులకుపాల్పడుతున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ హింసను ప్రేరేపిస్తుందని ఘాటుగా విమర్శించారు. మాట్లాడితే ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు దాడులకు పాల్పడడమే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలనో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.