వేల్పూర్, సెప్టెంబర్ 27: ఎన్నికలప్పుడు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చి కొంటామన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మక్క, సోయా, వరి పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ విషయంలోనూ మోసగించారని, ఉమ్మడి జిల్లాలో సగం మంది రైతుల రుణాలను కూడా మాఫీ చేయలేదని, రైతు భరోసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వేల్పూర్‌లోని తన నివాసంలో శుక్రవారం వేముల విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయించిన ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్‌లో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని, చెప్పినట్లే బోనస్ చెల్లించి రైతుల పంటలను కొనుగోలు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మక్కజొన్న సాగు చేశారని, పంట కోతలు కూడా ప్రారంభమయ్యాయన్నారు.
కానీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో దళారులు తక్కువ ధరకే కొంటుండడంతో రైతులు ఎకరాకు రూ.60 వేల దాకా నష్టపోతున్నారన్నారు. మక్కకు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,225లకు తోడు కాంగ్రెస్ ఇస్తామన్న రూ.500 బోనస్ చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సోయా పంట మద్దతు ధర రూ.4,892 కాగా, దళారులు రూ.4,300 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ వ్యాపారులు సోయా కొనడం ద్వారా రైతులు రూ.500 బోనస్‌తో కలిపి క్వింటాల్‌కు రూ.1100 నష్టపోతున్నారన్నారు.
వడ్లకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు సన్నవడ్లకే ఇస్తామని మాట మార్చిందని దుయ్యబట్టారు. రుణమాఫీ విషయంలోనూ అలాగే చేసిందన్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 3,79 లక్షల రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, 1.75 లక్షల మందికి మాత్రమే రైతులకు మాఫీ అయ్యిందన్నారు. ఇంకా 2.04 లక్షల రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 48 వేల మందికి గాను 32 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరించారు. సంపూర్ణ మాఫీ చేసే వరకూ వదిలేది లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటి హెల్త్ ప్రొఫైల్ తయారుచేసి, సీజనల్, ఇతర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుందని వేముల గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌కు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, దీంతో సీజనల్ వ్యాధులు విజృంభించాయన్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల సేవలను కూడా సరిగా వాడుకోలేక పోతోందన్నారు. వెంటనే హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కా పాడాలని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు, చికెన్ గున్యా లాంటి వాటికి మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పార్టీ నేతలు ఎలియా, భూమేశ్, గంగాధర్, నర్సారెడ్డి, రాజేశ్వర్, గంగారెడ్డి పాల్గొన్నారు.
వేల్పూర్, సెప్టెంబర్ 27: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామన్నపేట్, వేల్పూర్ గ్రామాల మధ్య తెగిపోయిన రోడ్డును శుక్రవారం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. రోడ్డు విస్తరణ కోసం నిధులు మంజూరైనందున వాటి నుంచి ఇక్కడ కల్వర్టు నిర్మాణం చేపట్టేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.