ఏర్గట్ల, జూలై 28: రైతులు సంతోషంగా ఉండాలంటే అది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం మాట్లాడుతూ రైతులు పచ్చని పంటలు పండించి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపాటి కారణాలతో ప్రాజెక్టు నుంచి నీళ్లను వదలకుండా రైతులను ఇబ్బందిపెట్టిందన్నారు. సాగు నీరు వదలకపోతే 50వేల మంది రైతులతో తరలివచ్చి మోటర్లు ఆన్‌చేస్తామని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన అల్టీమేటంతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. 24గంటల్లోనే ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు వద్ద నీటి విడుదలను శనివారం ప్రారంభించిందని, దీంతో రైతుల ముఖంలో సంతోషం నెలకొన్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కూతురు చిన్నసాయన్న, నాయకులు మాస్ గంగాధర్, తొర్తి మాజీ సర్పంచ్ కుండ నవీన్, ఉగ్గెర చిన్నయ్య, రాజేశ్వర్, తిరుపతి, ధనాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.