పెద్ద కొడప్ గల్(పిట్లం) : కామారెడ్డి జిల్లా పిట్లం (Pitlam) మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantarao) ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా (Womens ) సాధికారత లక్ష్యంగా, అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని అన్నారు.
మహిళలు వంటింటికి పరిమితం కాకుండా, స్వశక్తితో నిలబడుతూ వ్యాపార రంగం, ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
ఆడబిడ్డలు చదువు మధ్యలో ఆపేయకూడదని,ఉన్నత విద్యలు అభ్యసించాలని సూచించారు. మహిళల చదువుతోనే కుటుంబాలు బాగుపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.