బోధన్, జనవరి 4: నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిచేందుకు మెలిక పెట్టింది. కనీసం పది వేలకు పైగా ఎకరాల్లో చెరుకు పండిస్తేనే ఫ్యాక్టరీని తెరిచి నడపడం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ఎడపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన చెరుకు రైతుల అవగాహన సదస్సులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ ఈ మేరకు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని, అయితే ముందుగా రైతులు విస్తారంగా చెరుకు పండించాల్సి ఉంటుందని చెప్పడం ద్వారా పరోక్షంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ బాధ్యతను రైతుల పైకి నెట్టేశారు. మరోవైపు, సదస్సుకు ఎంపిక చేసిన కొద్ది మంది రైతులను, అధికార పార్టీకి చెందిన వారిని మాత్రమే ఆహ్వానించి, మిగతా రైతులను పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, అయితే రైతులు చెరుకును విస్తారంగా పండించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. చెరుకు పండించే విషయంలో రైతులు వాస్తవాలను చెప్పాలని కోరారు. ఈ ఏడాది చెరుకు పంట వేసే కాలం దాటి పోతున్నదని, దీంతో ఈ ఏడాది చెరుకు విత్తనం పంటను 300 నుంచి 400 ఎకరాల్లో వేసే విషయాన్ని రైతులు పరిశీలించాలన్నారు. తర్వాత వచ్చే ఏడాది సీజన్లో చెరుకు పంటను విస్తారంగా వేసినట్లయితే, ఆ చెరుకు క్రషింగ్ కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ప్రస్తుతానికి పాత యంత్రాలకు మరమ్మతులు చేసి అదే ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ చేస్తామన్నారు. ఒకవేళ చక్కెర రికవరీ తక్కువగా వస్తున్నట్లయితే, పాత ఫ్యాక్టరీకి బదులుగా కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాగా నడవాలంటే కనీసం 16 వేల నుంచి 18 వేల ఎకరాల్లో చెరుకు వేస్తేనే సాధ్యమవుతుందని షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ స్పష్టం చేశారు. బోధన్‌తో పాటు మెట్పల్లి, ముంబోజిపల్లి యూనిట్లను తెరిచేందుకు సానుకూలంగా ఉన్నామని తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన చెరుకును సాగు చేసే విషయంలో రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు.
సుదర్శన్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేక అనుమానాలను రేకెత్తించాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని బోధన్‌లో నడపటం కుదరకపోతే ఇక్కడి నుంచి తరలిస్తామని చేసిన వ్యాఖ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఫ్యాక్టరీలో ప్రస్తుతమున్న యంత్రాలకు మరమ్మతులు చేసి నడిపిస్తామని, అప్పటికీ వయేబిలిటీ కాకపోతే తరలిస్తామని అనడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసింది. మరోవైపు, పది వేల ఎకరాల్లో చెరుకు పండించకపోతే ఫ్యాక్టరీ నడపడం అసాధ్యమనడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశమేమిటో బయటపడింది. చక్కెర ఫ్యాక్టరీ నడవాలంటే ముడి సరుకు చెరుకు అవసరం. అయితే, ఏడాదిగా చెరుకు సాగుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో పునరుద్ధరణ విషయంలో సర్కార్‌వి ఉత్తుత్తి మాటలేనన్న విమర్శలున్నాయి. ఈ తరుణంలోనే ఇప్పుడు సదస్సు అంటూ కొత్త నాటకం మొదలెట్టిందని రైతులు మండిపడుతున్నారు.
చెరుకు రైతులు బాగుంటేనే ఫ్యాక్టరీ నడిచి యాజమాన్యానికి లాభాలు వస్తాయని, ఫ్యాక్టరీ యాజమాన్యం బాగుంటేనే రైతులకు సకాలంలో బిల్లులు ఇవ్వగలదని, ఈ రెండూ పరస్పర ఆధారితాలని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో యాజమాన్యం బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో రైతులు ఫ్యాక్టరీ చుట్టూ చెప్పులరిగేలా తిరిగారని, తద్వారా క్రమంగా చెరుకు సాగుకు దూరమయ్యారన్నారు.చెరుకులో అధిగ దిగుబడులపై అధ్యయనం కోసం గతంలో రైతులను మహారాష్ట్రకు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. వరి పంటకు ఇస్తున్నట్లు చెరుకుకు కూడా బోనస్ ఇవ్వాలని, తద్వారా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంటుందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. వరి కంటే చెరుకు సాగు చేయడం ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. చెరుకు సాగు చేయటం ద్వారా నిజాం షుగర్స్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.
వాస్తవానికి చెరుకు రైతుల సదస్సులో రైతుల కంటే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. ఎంపిక చేసిన కొందరు రైతులను మాత్రమే సదస్సుకు ఆహ్వానించి, చెరుకు రైతు సంఘాల ప్రతినిధులను విస్మరించారు. చెరుకు పంటను వేయాలని నేతలందరూ చెప్పినప్పటికీ, రైతులకు ఏమేరకు ప్రోత్సాహకాలు ఇస్తారన్నది స్పష్టంగా చెప్పలేదు. చెరుకు పండిస్తే.. ఇచ్చే ప్రోత్సాహకాలు, చెరుకు బిల్లులకు కాలపరిమితి విధించటం వంటి వాటిపై ఊసే ఎత్తలేదు. ఈ నేపథ్యంలోనే.. నిజాం షుగర్స్ పునరుద్ధరణ చేయలేమన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు రైతులు చెరుకు పండించలేదు కాబట్టే ఫ్యాక్టరీని తెరవలేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.