నవీపేట, ఆగస్టు 30: ఎస్సారెస్పీలో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో అలీసాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని కోస్లీ గోదావరి నది మొదటి పంప్ హౌస్ వద్ద కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి అలీసాగర్ నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..నీటిని పొదుపుగా వాడుకుంటే రెండో పంట కూడా పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం అలీసాగర్ కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేశారు.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రుణమాఫీ అంశాన్ని స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. రుణమాఫీ కోసం రూ. 18 వేల కోట్లు విడుదల చేయగా.. రైతుల ఖాతాల్లో రూ. 11 వేల కోట్లు జమ అయినట్లు తెలిపారు. మిగతా రూ. 7వేల కోట్లు ఆయా బ్యాంకుల్లో జమచేసి ఉన్నాయన్నారు.