బోధన్, ఆగస్టు 10: బోధన్ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పలు వార్డుల్లో వీధికుక్కల బెడద ఎక్కువైందని తెలిపారు. రెండు రోజలు క్రితం హనుమాన్ టేక్డీలో ఆరుబయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయన్నారు.
ఈ విషయంలో తమతోపాటు స్థానికులు కూడా మున్సిపల్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. వర్షాలకు వార్డుల్లోని రోడ్లపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో ప్రతి ఏడాది వర్షాకాలంలో మొరం వేయించేవారని, ప్రస్తుతం మున్సిపాలిటీలో స్పందించే వారే కరువయ్యారని అన్నారు. సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించాలని ఎమ్మెల్యేను కోరారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, పార్టీ సీనియర్ నాయకుడు కేవీ సత్యం, మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఎంఏ రజాక్, కార్మిక విభాగం పట్టణ అధ్యక్షుడు రవిశంకర్ గౌడ్, నాయకులు ప్రవీణ్ జాదవ్, అహ్మద్, సాగర్, షేక్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.