బాన్సువాడ, మార్చి 15 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల్లో 13 స్కీంలు వంద రోజుల్లో అమలుచేస్తామని హామీ ఇచ్చి శనివారంతో వందరోజులు పూర్తవుతున్నదని తెలిపారు. హామీలను అమలుచేస్తే పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నా రు.
పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 50 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులను శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే మరో మూడు నెలల కాలయాపన చేస్తుందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో బాన్సువాడ నియోజక వర్గంలో 16 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందించామని తెలిపారు. ఇప్పుడు కొలువుదీరిన కొత్త ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంలో లక్షా116 రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పిందని, ఇంతవరకు దానికి సంబంధించి నియమ నిబంధనలు లేవన్నారు. 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలకు రూ.2500, పింఛన్ రూ. 4వేలు, రైతుబంధు పథకం ద్వారా రూ. 15 వేలు ఇస్తామని ఇప్పటి వరకు రూ. 10 వేలు కూడా సరిగా వేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీలు సుజాతా నాగేందర్, జడ్పీటీసీ శంకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.