బాన్సువాడ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించబడిన సన్న రకాల అన్నిటికీ బోనస్ ఇస్తామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. గురువారం రుద్రూర్, వర్ని మండల కేంద్రాల్లో డీసీవో శ్రీనివాసరావు, ఆర్డీవో వికాస్ మెహతో తో కలిసి ధాన్యం( Paddy) కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద బాన్సువాడ నియోజకవర్గంలో మొట్టమొదట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. వరి పంట పండించడంలో బాన్సువాడ నియోజకవర్గ ముందుందని, అంతేకాకుండా దిగుబడి అధికంగా తీయగల సత్తా ఉన్న రైతులు బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నారని అన్నారు.
తొందరలోనే సిద్దాపూర్ రిజర్వాయర్ను ప్రారంభిస్తామని, ఆయకట్టు కింద వందల ఎకరాలు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ రిజర్వాయర్ సాగునీరు అందని మిగతా వ్యవసాయ భూమికి మరో చెరువు తవ్వించి పూర్తిస్థాయిలో పంటలు పండే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులు ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రస్తుతం రూ.1,900 ధరతో దళారులు కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం రూ. 2,320 రూపాయల మద్దతు ధరను ఇస్తుందన్నా. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తహసీల్దార్ తారబాయి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్, నాయకులు పత్తి రాము, సంజీవ్ రెడ్డి, ఎంపీడీవో భీంరావ్, ఏవో సాయికృష్ణ , రైతులు ఉన్నారు.