నిజామాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; పీసీసీ చీఫ్ హోదాలో మహేశ్‌కుమార్‌గౌడ్ తొలిసారి నిజామాబాద్‌కు గౌడ్ వచ్చినప్పుడు భరోసా ఇస్తాడనుకుంటే, నిధులపై ప్రకటన చేస్తాడనుకుంటే హైడ్రా మాదిరిగా నిడ్రా పెడతామమంటూ సామాన్య జనాలను భయపెట్టాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
ఈ ప్రకటనతో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కుదేలయ్యారన్నారు. నిడ్రా తెచ్చి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చేస్తామని చెప్పడంతో అందరూ భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌లో అత్యున్నతమైన పదవిలో ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లాను అభివృద్ధి చేయాలలి తప్పితే ప్రజల ఇంటి మీదికి బుల్డోజర్లు తీసుకెళ్లద్దని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, మేయర్ దండునీతూ కిరణ్‌తో కలిసి సోమవారం నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కవిత విలేకరులతో మాట్లాడారు.
స్థానిక సంస్థల్లో ప్రజలు మన వైపే చూస్తున్నారని, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలని కవిత బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్తలంతా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి. ప్రశ్నించండని పిలుపునిచ్చారు. రాబోయే రోజులు మనవే. పార్టీకి పునర్వైభవం వస్తుందన్నారు. పార్టీని వీడి వెళ్లిన నాయకులు ఇప్పుడు తీవ్రంగా మథన పడుతున్నారని, కాంగ్రెస్‌లోకి ఎందుకు పోయామని బాధ పడుతున్నారని తెలిపారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు ఆలోచనలో పడ్డారని చెప్పారు.
టీఎస్ఎండీసీ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్‌కు నియంత్రణ చేసే అధికారం ఉన్నప్పటికీ పెద్దవాగు, కప్పలవాగులో ఇసుక దోపిడీ జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్ల ముందు నుంచే ఇసుక రవాణా జరుగుతున్నదని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఇసుక, గుట్కా దందాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. పేట్రేగిపోతున్న గుట్కాను పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. మేడిగడ్డ నుంచి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు నింపి నిజామాబాద్ సుభిక్షంగా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తే ఎక్కడ మనకు పేరు వస్తుందోనన్న పిచ్చి ప్రయత్నంతో రైతులను ఇబ్బందులకు గురి చేశారన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3.79 లక్షల మందికి కేసీఆర్ హ యాంలో రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కేవలం 2 లక్షల మందికే చేసిందని కవిత తెలిపారు. నిజామాబాద్‌లో ఇంకా 1.02 లక్షల మందికి, కామారెడ్డి జిల్లాలో 75వేల మందికి రుణమాఫీ జరుగలేదని గణాంకాలతో వివరించారు. తెలంగాణ యూనివర్సిటీకి వీసీని నియమించినప్పటికీ నిధుల్లేవని, బడ్జెట్ కేటాయింపులు సున్నాగా మారిందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోగా తెరిపిస్తామని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో సీఎం మాటిచ్చినప్పటికీ ఇంత వరకూ నెరవేర్చలేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, నిజామాబాద్ నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు సిర్ప రాజు, ముఖ్య నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాశ్, మాస్తా ప్రభాకర్, సుమిత్రానంద్, చింతా మహేశ్, శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ శంకర్ పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి అనాథలా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా మంత్రి లేడని, ఇన్చార్జి మంత్రి ఎప్పుడు వస్తాడో తెలియదని, ఎంపీ ఉన్నా లేనట్లేనని మండిపడ్డారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టరు. వారిని ఏమీ చేయనీయరు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన నేతలే అన్నీ చేస్తారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి వంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కొంతకాలంగా నిజామాబాద్‌కు సీపీ లేకపోతే పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ను టార్గెట్ చేశాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. లేనిపోని ఆరోపణలతో జైలుకు పంపాలని యత్నిస్తుండడాన్ని సభ్య సమాజం ఖండిస్తున్నది. కవితపై కేంద్రం నిరంకుశంగా వ్యవహరించింది. ఇప్పుడు కేటీఆర్‌పైనా అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్ హయాంలో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటే ఇప్పుడు అధోగతి పాలవుతున్నది. గురుకులాల్లో పిల్లలకు సరిగా తిండి పెట్టే చాతనైతలేదు. కేసీఆర్ హయాంలో గురుకులాల్లో సమస్యల్లేకుండా పరిపాలన అందించాం. ఇప్పుడెందుకు సమస్యలు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డి చీటర్. దొంగ హామీలిచ్చి గద్దెనెక్కి ప్రజలను ఏడిపిస్తుండు.
– బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే
ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు పోరాటాలు కొత్త కాదు. 14 ఏండ్ల పాటు అలుపెరగని ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న చరిత్ర కేసీఆర్‌కు ఉంది. అలాంటి పార్టీకి, అలాంటి నాయకత్వాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ఇబ్బంది పెట్టినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అన్యాయంగా కవితను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కేటీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టాలని యత్నిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లేనిపోలని కేసులతో జనాల మూడ్‌ను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది.
– దాదాన్నగారి విఠల్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్