నిజాంసాగర్, ఏప్రిల్ 5: భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను నా ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటానని, వారిపై ఈగ వాలినా ఊరుకోనని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దమ్ముంటే వారు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, బీఆర్ఎస్ హయాంలో మేము అభివృద్ధి చేశాం… ప్రజలకు వివరిస్తున్నామంటూ చెప్పారు. ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలకు గ్రామాల్లోకి రానివ్వరని ప్రతిపక్షాలను హెచ్చరించారు.
నిజాంసాగర్ మండలంలోని మహ్మద్‌నగర్ గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా నిలిపారని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయానికి 24గంటల విద్యుత్, సాగు నీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌కు తీసుకురావడం, నాగమడుగు మత్తడి నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు తీసుకొచ్చారన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచ ఖ్యాతి గల ఐటీ సంస్థలను, సుమారు 18వేల పరిశ్రమలను రాష్ర్టానికి రప్పించి 21లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నదని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నాడని అందుకే యావత్ దేశం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని తెలిపారు. 25న ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలని, అదే రోజు నియోజకవర్గంలో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నామని, దానిని విజయవంతం చేయాలని కోరారు. మండలానికి ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చామని, ఏమైనా మిగిలి ఉంటే త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మహ్మద్‌నగర్‌ను మండలంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు వివరించినట్లు చెప్పారు.
కొత్త బిచ్చగాళ్లు వస్తారు.. జాగ్రత్త
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందో గ్రామాల్లోని ప్రజలకు తెలుసని ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడంతో కొత్త బిచ్చగాళ్లు గ్రామాల్లోకి వస్తారని, వారు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రశ్నించాలని సూచించారు. 70ఏండ్లల్లో ప్రతిపక్షాలు ఏం చేశాయో, కేసీఆర్ పాలనలో తాము ఏం చేశామో అందరికీ తెలుసని చెప్పారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు మా రాష్ర్టాల్లో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు వారి ప్రభుత్వాలను నిలదీస్తున్నారని చెప్పారు. మరోసారి హన్మంత్షిండేను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ వాజిద్‌అలీ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.