నిజాంసాగర్, అక్టోబర్ 30 : జుక్కల్ నియోజకవర్గంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో సంక్షేమం, అభివృద్ధి కోసం మన కేసీఆర్ ప్రభుత్వం రూ.5500 కోట్లు వెచ్చించిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయ న మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జుక్కల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయనున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు పురోగతిలో ఉందన్నారు. నియోజకవర్గంలో మూడు 30 పడకల దవాఖానలు, ఒక వంద పడకల దవాఖాన మంజూరు చేసుకున్నామని వివరించారు. 65సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మనం పది సంవత్సరాల్లో చేసి చూపించామన్నారు. వంద గ్రామాలకు రోడ్లు సరిగ్గా లేకపోవడంతో రవాణా వ్యవస్థ సక్రమంగా లేకుండా ఉండేదని అలాంటి రోజుల నుంచి నేడు అన్ని గ్రామాల్లో బీటీ రోడ్లు వేసుకున్నామని గుర్తు చేశారు.
మరోమారు అధికారంలోకి వచ్చాక పిట్లంలో డిగ్రీ కళాశాల, నిజాంసాగర్, కౌలాస్కోట, కౌలాస్నాలా ప్రాజెక్టును పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, రామలింగేశ్వర ఆలయాన్ని బాగు చేసుకోవాలని, సలాబత్పూర్ ఆలయంలో ప్రస్తుతం రూ.6.70 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని ఆలయాన్ని కూడా బాగు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. మరో మారు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని అన్నారు. సభల్లో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొండెగే, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సహకార సంఘం అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, జిల్లా బంజారా సంఘం అధ్యక్షుడు బద్యానాయక్, మోహన్ నాయక్, సంగ్రాం నాయక్, మైనారిటీ నాయకులు మహ్మద్ ఎజాజ్, వాహబ్, మీరా, ఎంఐఎం నాయకులు సయ్యద్ ఖాన్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, పిట్ల శ్రీధర్, ప్రవీణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.