కంఠేశ్వర్, ఆగస్టు 22 : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్న 11వ ఏషియన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ స్విమ్మింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టాపల్లి రిత్విక ఎంపికైంది. ఈ పోటీలకు మనదేశం ఆతిథ్యం ఇవ్వనున్నది. మిట్టాపల్లి రిత్విక దేశం తరపున ఆడడానికి ఎంపికైనట్లు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మోనాల్ చౌక్ షీ ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 26 వరకు నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణలో పాల్గొనాలని సూచించారు.
ఏసియన్ దేశాలతో పోటీ పడడానికి మన దేశం తరపున పాల్గొంటున్న మిట్టాపల్లి రిత్వికను పీసీసీ చీఫ్ మహేశ్‌కమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి ఉమేశ్, ఉపాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు , సభ్యులు శ్యాంసుందర్‌రెడ్డి, వేణుగోపాల్, కైసర్, కర్ణాటక శ్రీనివాస లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్, రాగిణి అభినందించారు.