కంఠేశ్వర్, జనవరి 5: మున్సిపల్ ఓటరు జాబితాల్లో భారీగా తప్పులు దొర్లాయి. వార్డుల వారీగా ప్రకటించిన లిస్టుల్లో అనేక అవకతకవలు చోటు చేసుకున్నాయి. భారీగా చోటు చేసుకున్న తప్పులపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. డివిజన్లలో నివాసముంటున్న కొందరి పేర్లు మాయం కాగా, సంబంధం లేని వారి పేర్లు ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకున్న తప్పులపై ఆయా పార్టీల నేతలు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి ఇటీవల ఓటర్ల జాబితా విడుదల చేశారు. 60 డివిజన్ల పరిధిలో 1,66,429 మంది పురుషులు, 1,79,406 మంది మహిలలు, ఇతరులు 43 మంది కలిపి మొత్తం 3,45,878 ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అయితే, డివిజన్ల వారీగా ప్రచురించిన ముసాయిదా జాబితాలో అనేక తప్పులు దొర్లాయి. ఒక డివిజన్లో నివాసముండే వారి పేర్లను మరో డివిజన్లో చేర్చడం, జాబితాల్లో అపరిచుతుల పేర్లు ప్రత్యక్షం కావడం, చనిపోయిన వారి పేర్లను తొలగించక పోవడం వంటివెన్నో తప్పులు చోటు చేసుకున్నాయని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తప్పుల కుప్పగా మారిన ఓటరు జాబితాలను వెంటనే సవరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజకీయ పార్టీలతో కార్పొరేషన్ అధికారులు నిర్వహించిన సమావేశంలో పలు ఫిర్యాదులు చేశారు. మరోవైపు, ప్రతి డివిజన్‌లోనూ ఓట్లు గల్లంతయ్యాయని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు తెలిపారు. ఓటరు జాబితాలను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డియాండ్ చేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో ఓటర్ల జాబితాలు గందరగోళంగా మారాయి. ఒక డివిజన్ పరిధిలోని ఓటర్లను మరో డివిజన్‌లోకి ఎందుకు మార్చారు? దీనికి ఎవరు కారణం? అధికారుల తప్పా.. లేక అధికార పార్టీ నేతల తప్పా? ఓటర్ జాబితాలను వెంటనే సరిదిద్దాలి. లేకుంటే ఎన్నికల నోటిఫికేషన్ని అడ్డుకుంటాం.
– సుజిత్‌సింగ్ ఠాకూర్, బీఆర్ఎస్ నాయకుడు
ఓటర్ జాబితాల రూపకల్పనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఓట్ల గల్లంతు, జాబితాల్లో తప్పులు దొర్లాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అవకతవకలు, అభ్యంతరాలను మున్సిపల్ కమిషనర్ పరిశీలించి సవరణలు చేపట్టాలి.
– సిర్ప రాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు