కామారెడ్డి, ఫిబ్రవరి 2: జిల్లాలో తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలలు, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, మానవ అక్రమ రవాణాకు గురైన చిన్నారుల జాడ కనిపెట్ట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుండగా.. పోలీస్, శిశు, విద్యా, బాల సంరక్షణ శాఖలు భాగస్వాములవుతున్నాయి. ఆపరేషన్ ముస్కాన్-11 కింద బాలలను వెట్టి నుంచి విముక్తి కల్పిచడంతోపాటు వారికి అక్షరజ్ఞానం కల్పించేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కింద జనవరిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 54 మంది బాలబాలికలకు వి ముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇతర రాష్ర్టాల బాలలను వారి ప్రాంతాలకు పంపించారు. ఎవరైనా బాలబాలికలను పనిలో పెట్టుకుంటే 100,1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. బాల కార్మికులు, భిక్షాటన, వెట్టిచాకిరీ చేస్తున్న చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలను అనాధాశ్రమాలకు పంపించడం, చదువుకు దూరమైన వారిని తిరిగి బడిలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించడం వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నారు.
జిల్లాలో జవనరి 1వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 54 మంది బాలబాలికలను గుర్తించారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ల వారీగా ఆయా శాఖల అధికారులతో కలిసి మూడు బృందాలతో తనిఖీలు చేపట్టారు. 54 మంది బాల బాలికలను ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గుర్తించగా, ఇందులో 9 మంది బాలికలు, 45 మంది బాలురు ఉన్నారు.
ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో గుర్తించిన బాలలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు వారి తల్లిదండ్రుకు అప్పగించారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులకు బాలకార్మిక చట్టం కింద రెండేండ్ల జైలుశిక్షతోపాటూ జరిమానా విధిస్తున్నారు. బాలకార్మికులను గుర్తిస్తే వారిని బాలల సంరక్షణ సమితికి అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు.
జిల్లాలో బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశాం. 54 మంది బాలబాలికలకు విముక్తి కల్పించాం. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మూడు డివిజన్లలో తనిఖీలు చేపట్టాం. బాలలతో పనిచేయించడం, పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా బాల కార్మికులను దుకాణాలు, హోటళ్లు, పరిశ్రమలు, సంస్థల్లో పెట్టుకుంటే 100 లేదా 1098 నం బర్లకు సమాచారం ఇవ్వాలి. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై చర్యలు తీసుకుంటాం.
-సింధూశర్మ, కామారెడ్డి ఎస్పీ