మోర్తాడ్, ఫిబ్రవరి 14: చర్చల ద్వారా ప్రతి సమస్యకూ పరిష్కారం లభిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్‌లో ఒక వర్గంవారు సర్వాయి పాపన్న విగ్రహాన్ని తొలగించగా..యథావిధిగా అక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో పదకొండురోజులుగా నిరసన దీక్ష చేపడుతున్నారు. గౌడసంఘం సభ్యులను దీక్షా శిబిరంలో మంత్రి వేములప్రశాంత్‌రెడ్డి మంగళవారం కలిసి మాట్లాడారు. దీక్ష చేపట్టడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం చేయాలని గౌడసంఘం సభ్యులు మంత్రిని కోరారు. దీంతో ఇరువర్గాలతో అధికారులు, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామని, దీక్ష విరమించాలని మంత్రి కోరగా.. అందుకు గౌడసంఘం సభ్యులు అంగీకరించారు.
గురువారం వేల్పూర్‌కు రావాలని వారికి సూచించారు. అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఎవరూ బాధపడ్డ ఇబ్బందికరంగానే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని మంత్రి చెప్పగానే.. సభ్యులు దీక్షను విరమించారు.