వేల్పూర్, జనవరి 5: వ్యవసాయా న్ని అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లక్కోర గ్రామంలో రూ.7 కోట్ల తో పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కూడా నిల్వ చేసుకునేందుకు ఎంతో ముందు చూపుతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించారని తెలిపారు. ఈ రెండు రోజుల్లో సికింద్రాపూర్,లక్కోర గ్రామాల్లో రూ.16కోట్లతో నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ప్రారంభించుకున్నామని తెలిపారు. గోడౌన్ నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
బాల్కొండ.. బంగారు కొండ: గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్
బాల్కొండ నియోజకవర్గాన్ని మంత్రి వేముల బంగారు కొండగా తీర్చిదిద్దుతున్నారని గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నహితులైన మంత్రి నియోజకవర్గ ప్రజలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన దరిదాపుల్లో కూడా ఎవరులేరని అన్నారు. బాల్కొండను ఇంత అద్భుతంగా అభివృద్ధి చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు నిలబెట్టుకున్నారని కొనియాడారు. రైతులు పండించిన ప్రతి గింజనూ గోదాముల్లో నిల్వ ఉంచడానికి ప్రభుత్వం గిడ్డంగుల నిర్మాణం చేపడుతుందన్నారు. ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి,ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, సర్పంచ్ వంశీ, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, విండో చైర్మన్లు పాల్గొన్నారు.