ఎంపీ అర్వింద్‌కు దమ్ముంటే అతడు చేసిన అభివృద్ధి ఏమిటో, తెచ్చిన నిధులు ఎన్నో చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాతే గ్రామాల్లో అడుగు పెట్టాలన్నారు. వివిధ పార్టీల కార్యకర్తలు శనివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
– వేల్పూర్, ఫిబ్రవరి 25
వేల్పూర్, ఫిబ్రవరి 25: ఎంపీ ధర్మపురి అర్వింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులు మాట్లాడుతారు తప్ప ఆయన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తాను బాల్కొండ నియోజకవర్గంలో పది వేల మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 40 కోట్లు అందించానని తెలిపారు. అర్వింద్‌కు దమ్ముంటే పీఎంఆర్ఎఫ్ కింద పేదలకు ఆర్థిక సాయం అందించాలని సవాల్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 500 మంది మంత్రి వేముల సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేల్పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి వేముల మాట్లాడారు.
మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో శుక్రవారం ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. ఎంపీ అర్వింద్‌కు దమ్ముంటే గ్రామాల్లో పర్యటించే ముందు ఆ ఊరికి ఏమి ఇచ్చావో, ఎంపీ నిధులతో ఏమి అభివృద్ధి చేశావో చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చి గెలిచి రైతులను మోసం చేసిన అర్వింద్, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే పసుపు పరిశ్రమ తెస్తానని సిగ్గు లేకుండా చెబుతున్నాడని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అన్ని ఇస్తామని చెబుతున్న ఎంపీ.. ముందుగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయించాలని డిమాండ్ చేశారు. 18 రాష్ర్టాల్లో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అక్కడ ప్రజలకు ఇస్తున్న పెన్షన్ ఎంతో అందరికీ తెలుసన్నారు. ప్రజలంతా మెల్లమెల్లగా ఆలోచన చేసే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
ఈ ఎనిమిదేండ్ల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. రూ.వందల కోట్లతో బీటీ రోడ్లు, మెయిన్ రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, హెల్త్ సబ్‌సెంటర్లు, గ్రామపంచాయతీ భవనాలు, కులసంఘాల భవనాలు, 50కి పైగా ఆలయాలు నిర్మించినట్లు వివరించారు. ఎండాకాలంలో నవాబు లిఫ్ట్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్‌ను నడిపిస్తూ చెరువులను నింపుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధి, మార్పు ప్రజలు గుర్తించాలని కోరారు. కొందరు అక్కడక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తారని, అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని కోరారు. కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వంలో పని చేసేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరినవారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి వారంతా పార్టీ నాయకులు, సభ్యులే అని, అందరికీ తోడుగా ఉంటానని మంత్రి భరోసానిచ్చారు.