తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ సమైక్యపాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైందని.. స్వరాష్ట్రంలో పునరుజ్జీవ పథకంతో పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
– మెండోరా/ఖలీల్‌వాడి, జూలై 26
మెండోరా, జూలై 26: తెలంగాణ వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ సమైక్యపాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైందని.. స్వరాష్ట్రంలో పునరుజ్జీవ పథకంతో పూర్వవైభవం సంతరించుకున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రివర్స్ పంపింగ్‌తో ఎస్సారెస్పీలోకి నీళ్లు వస్తాయా అని అనేకమంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ దాన్ని సీఎం కేసీఆర్ సాధ్యం చేసి చూపించారని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి 60 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రాజెక్టు వద్ద బుధవారం నిర్వహించిన 60 వసంతాల వేడుకకు మంత్రి హాజరయ్యారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్‌హస్ వద్ద మంత్రి ప్రసంగించారు.
పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చామన్నారు. దీంతో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రణాళికలు చేశామన్నారు. ప్యాకేజీ 21, 22 ద్వారా ఉమ్మడి జిల్లాలోని గ్రామాలకు త్వరలోనే కాళేశ్వరం జలాలను అందిస్తామన్నారు. పునరుజ్జీవ పథకంతో రైతులకు సాగునీటి భరోసా కలిగిందని, శ్రీరాంసాగర్ ఎప్పుడూ నిండుకుండలా ఉంటుందని తెలిపారు. ఎత్తిపోతల ద్వారా రైతాంగానికి సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని 1951లో నాటి హైదరాబాద్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే, 12 ఏండ్ల తర్వాత అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1963లో సుమారు 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 40కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. 2015-16లో పదిలక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా రెండో ఫేజ్ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, దీంతో ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. 1996లో ఎస్సారెస్పీ కట్టమీద ప్రాజెక్ట్ దుస్థితిని చూసిన కేసీఆర్.. ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాల్లా, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎన్నోసార్లు ఎండిపోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూశానన్నారు. 2009-10లో వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఎస్సారెస్పీ ప్రాజెక్టు దుస్థితిని కండ్లారా చూశామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా దీవించు తల్లీ.. తరలిరావమ్మా.. అంటూ గంగమ్మ తల్లికి పూజలు చేశామని నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెందిన 42 ప్రధాన వరద గేట్లకుకు ప్రత్యేకంగా రూ. 2.6కోట్లతో స్కాడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిమోట్ గేట్ ఆపరేషన్ సిస్టమ్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రధాన వరద గేట్లు, మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సీసీటీవీని పరిశీలించారు. ఒక్కో గేటుకు అమర్చిన సీసీ కెమెరాల పనితీరుపై ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుడు, రా్రష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ నాగేందర్, ఎస్సీరెస్పీ సీఈ సుధాకర్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఈ నల్లా వెంకటేశ్వర్లు, నిజమాబాద్ సీఈ మధుసూదన్, సీఈ శంకర్, ఎస్ఈ శ్రీనివాస్, సర్పంచ్ మిస్బా, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.