నిజామాబాద్: రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలను అమలు చేయాలని కొన్ని రాష్ట్రాలు చూస్తుస్తున్నాయని.. తెలంగాణలో చెక్ డ్యాముల నిర్మాణం దేశానికే ఒక మోడల్ గా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం కేసీఆర్‌ను ప్రజలు భారతదేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని.. వ్యక్తిగతంగా తనకు కూడా కేసీఆర్‌ను ప్రధానమంత్రిగా చూడాలని ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బాపూజీ నగర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బోధించి, సమీకరించి 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యం పండుతుందని, విద్యుత్ వినియోగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు.
నేడు తెలంగాణలో మూడెకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వరుడన్నారు. ఇక్కడి సంక్షేమ కార్యక్రమాలు చూసి పొరుగు రాష్ట్రాల బార్డర్ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామాలు విలీనం చేయాలని అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారని అన్నారు. స్వయంగా కర్ణాటక మంత్రి కూడా తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని అన్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలి. జీవితాంతం ఆయన ప్రజా పాలనలో కొనసాగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు.. అన్న మంత్రి వేముల పార్టీ శ్రేణులతో కలిసి లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో భీంగల్ మండల పార్టీ ప్రెసిడెంట్, జడ్పీటీసీ, ఎంపీపీ, భీంగల్ మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.