గత వేసవిలో ఎడారిని తలపించిన చెరువులు.. ప్రస్తుతం జలసిరులు సంతరించుకున్నాయి. నవాబ్ లిఫ్టు కాలువలను ఇటీవల రూ.11 కోట్లు వెచ్చించి మరమ్మతు చేశారు. ఈ కాలువ ద్వారా వేల్పూర్‌లోని మరుసుకుంట, మైరన్కుంట, కాటి చెరువులకు నీరు చేరి వేసవిలోనూ అలుగులు పారుతున్నాయి.
వేల్పూర్, మార్చి 16: ఒకప్పుడు వర్షాకాలంలోనే అలుగులు పారేవి.. మండుటెండ్లల్లో చెరువుల్లో నీరు కనిపించడమే గగనమయ్యేది. కానీ ప్రస్తుతం మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వేల్పూర్‌లో ఏకంగా మూడు చెరువులు అలుగు పారుతున్నాయి. ఇటీవల నవాబ్ లిఫ్ట్ ద్వారా కాలువల్లోకి నీటిని వదిలారు. నీరు కాలువల ద్వారా చెరువుల్లోకి చేరుతున్నది. వానకాలంలో కురిసిన వర్షాలతో ఇప్పటికే చెరువుల్లో నీరు ఉ న్నది. నవాబ్ లిఫ్ట్ ద్వారా విడుదలైన నీరు చెరువుల్లోకి చేరడంతో అవి అలుగు పారుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలోని మరుసుకుంట, మైరన్ కుంట, కాటి చెరువులు అలుగు పారుతున్నాయి.
గతంలో ఎండాకాలంలో చెరువుల్లో కనీసం పశువులు తాగడానికి కూడా నీరు ఉండేది కాదు. కాలువలను బాగుచేయిస్తే ప్రతి నీటి బొట్టూ చెరువులోకి చేరుతుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి భావించారు. దీంతో కాలువల మరమ్మతు కోసం ప్రభుత్వం నుంచి రూ.11 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఏండ్ల నుంచి మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకున్న కాలువలు బాగుపడ్డాయి. లిఫ్ట్ నుంచి వచ్చిన ప్రతి బొట్టూ సులువుగా చెరువుల్లోకి వెళ్లే విధంగా పనులు చేపట్టారు. కాలువల ఆధునీకరణతో పాటు ఫీడర్ చానళ్ల మరమ్మతులు చేపట్టారు. దీంతో ఎండాకాలంలో మైదానాన్ని తలపించే చెరువులు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. ఎండాకాలంలో అలుగు పారిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవని వేల్పూర్ గ్రామస్తులు అంటున్నారు. చెరువులన్నీ నిండుగా ఉండడంతో వానకాలంలో పంటలను త్వరగా సాగుచేసుకుంటామని వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కాలువలను బాగుచేయించి చెరువులు నిండేలా కృషిచేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటామని అంటున్నారు.
నాకు ఇప్పుడు 65 ఏండ్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎండాకాలం లో అలుగు పారుడు నేనెప్పు డు సూడలె. వేల్పూర్‌లోని మూడు చెరువులు ఇప్పుడు అలుగు పారుతున్నాయి. అ నుకుంటే ఏమైనా సాధిస్తామని కేసీఆర్ సారు ప్రభు త్వం, మా మంత్రి సారు నిరూపిస్తున్నరు. నవాబ్ లిఫ్ట్‌తోనే మా ఊర్లోని చెరువులు నిండినాయి.
– మల్లాగౌడ్, వేల్పూర్
మూడు చెరువులు ఎండాకాలంలో నిండి అలుగులు పారడం విచిత్రంగా ఉంది. నేను నమ్మలేకపోతున్న. గతంలో వానలు బాగా కురిస్తే.. వర్షాకాలంలోనే అలుగులు పారెటివి. ఇప్పుడు ఎండాకాలంలో కూడా మత్తడి దూకుతున్నది. గిట్లయితే రెండు పంటలకు ఎలాంటి ఢోకా ఉండది.
– మొండి నడ్పి రాజన్న, వేల్పూర్
మా ఊర్ల ఉన్న మూడు చెరువుల నుంచి అలుగు పార డం సంతోషంగా ఉంది. నేను ఎండాకాలంలో అలుగు పార డం ఎప్పుడు సూడలె. మా చిన్నప్పుడు ఎండాకాలంలో చెరువు ఎండిపోతే అందులో ఆటలు ఆడెటోళ్లం. ఇప్పుడు గ్రామంలోని చెరువులన్నీ నిండుగా ఉన్నాయి. పంటలకు సరిపడా నీళ్లు ఉండ డం సంతోషం.
– కుమ్మరి రాజారపు రాజన్న, వేల్పూర్