నిజామాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమాలకు పాల్పడే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆబ్కారీ శాఖలో జరుగుతున్న అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ సోమ, మంగళవారాల్లో ప్రచురించిన వరుస కథనాలపై ఆయన స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో అక్రమాల పర్వంపై సమగ్ర విచారణ చేయాలని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఆబ్కారీ శాఖ బాధ్యతలు చూస్తున్న జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీగా ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే అక్రమాలకు అడ్డుకట్ట లేకపోవడం అనేక విమర్శలకు తావిస్తున్నది. అధికారుల బరితెగింపుపై బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. ఎక్సైజ్ శాఖలో అవినీతి, వసూళ్ల పర్వాన్ని కళ్లకు కట్టినట్లు ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారులు, కల్లు డిపోలు, తదితర ముఠాల నుంచి అక్రమంగా వసూళ్లకు తెగబడుతూ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తున్న వైనాన్ని నమస్తే తెలంగాణ ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలోనే సీరియస్‌గా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్ షాపులకు మద్యాన్ని సరఫరా చేసే ఐఎంఎల్ డిపోలోనూ అవినీతి జరుగుతున్నదని బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు నమస్తే తెలంగాణ ప్రతినిధికి ఫోన్లు చేసి గోడు వెల్లబోసుకున్నారు. ఆబ్కారీ అవినీతిపై వార్తలు ప్రచురించడంపై హర్షం వ్యక్తం చేసిన బాధితులు.. ఐఎంఎల్ డిపోలోనూ ఎక్సైజ్ అధికారులే బ్రోకర్లను పెట్టి నెలవారీగా మామూళ్లను వసూళ్లు చేస్తున్నారని వెల్లడించారు. డబ్బులు ఇవ్వకపోతే మద్యం సరఫరాలో ఇబ్బందులు పెడుతున్నారని, చలాన్లు ముందే తీసుకున్నప్పటికీ చేయి తడపకపోతే లోడింగ్ విషయంలో జాప్యం చేస్తున్నారని వాపోయారు. వారి వేధింపులు భరించలేక రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నట్లు చెప్పారు. ఇలా వసూలయ్యే మొత్తాన్ని కీలక అధికారులతో పాటు ఐఎంఎల్ డిపో నిర్వహణలో సంబంధం ఉన్న పాత్రధారులంతా పంచుకుంటున్నట్లు తెలిసింది. మాక్లూర్ మండలం మాదాపూర్‌లో ఉన్న ఐఎంఎల్ డిపోపై ఉన్నతాధికారులు దృష్టి సారించక పోవడం వెనుక అవినీతికి మద్దతుగా నిలుస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.