మోర్తాడ్/కంఠేశ్వర్, సెప్టెంబర్ 30: విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తీసుకొస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆర్మూర్, భీమ్‌గల్, మోర్తాడ్‌లో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ భవనాలను ప్రారంభించారు.
అనంతరం కలెక్టరేట్లో విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫి తప్పకుండా చేస్తామన్న మంత్రి.. జిల్లాలో 71 వేల కుటుంబాలకు రూ.626 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలని ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు.
మాదక ద్రవ్యాల అడ్రస్ కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాలు గ్రామాలకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కల్లులో కలిపే ఆల్ఫాజోలం లాంటి పదార్థాల సరఫరాను నియంత్రించాలని ఆదేశించినట్లు చెప్పారు. బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ హందాన్, సహకార శాఖ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.