కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారు అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గులాబీ దళపతికి అండగా నిలిచేందుకు పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల రణరంగంలో బీఆర్ఎస్ విజయం ఖాయమైనప్పటికీ భారీ మెజారిటీ కోసమే కృషి చేస్తున్నారు. వలసల జోరు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అంతటా కనిపిస్తోంది.
నిజామాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన శ్రేణులు పెద్ద ఎత్తున గులాబీ కండువాను ధరిస్తున్నారు. జాతీయ పార్టీల తీరు నచ్చక స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో కారు ఎక్కుతున్నారు. కేసీఆర్ విధానాలను మెచ్చి కామారెడ్డి నియోజకవర్గంలో గులాబీ దళపతికి అండగా నిలిచేందుకు వస్తున్నట్లు వారంతా వెల్లడిస్తున్నారు. కేసీఆర్ పోటీ చేస్తుండడంతో పోరు ఏకపక్షంగానే ఉండడంతో జనంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఎన్నికల రణరంగంలో బీఆర్ఎస్ విజయం ఖాయమైనప్పటికీ భారీ మెజార్టీ కోస మే గులాబీ పార్టీ కృషి చేస్తున్నది. కేసీఆర్ అమలు చేసిన, చేస్తున్న అనేక పథకాలను ఇంటింటికీ చేర్చడంతో పాటు జనాకర్షక పథకాలతో జరుగుతున్న సంక్షేమాభివృద్ధిపై సామాన్యులు చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే గులాబీ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నుంచి చేరికల పర్వం పెరుగుతుండడంతో గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తుండగా ఇతర పార్టీల్లో నైరాశ్యం అలుముకున్నది.
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతుండడంతో కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. జారవీడుతున్న నేతలను కాపాడుకోలేక కాషాయ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో పాటు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా చాలా మంది బీజేపీని వీడుతున్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అబద్ధాలు, అసంబద్ధ వ్యాఖ్యలతో నిందించడం మినహా కేంద్రం ద్వారా మేలు చేసే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టకపోవడంతో బీజేపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో ఒకింత అసహనానికి గురి చేస్తున్నది. ప్రజల ఓట్లతో గెలిచిన వారంతా తిరిగి ప్రజలకు మేలు చేయాలంటే భారత రాష్ట్ర సమితి ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. గులాబీ కండువాను కప్పుకుని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు కారెక్కుతున్నారు. ప్రధాని మోదీ తీరు, బీజేపీ అవలంబిస్తున్న విధానాలు నచ్చక యువత సైతం కాషాయ పార్టీని వీడి కారెక్కుతుండడం విశేషం. వలసల జోరు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అంతటా కనిపిస్తున్నది. కామారెడ్డిలో ఈ మధ్య కాలంలో చాలామంది చేరుతుండగా మరి కొంత మంది చేరికకు సిద్ధం అయ్యారు. ఇకపోతే నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేకంగా చేరికల పర్వం ఉధృతంగా సాగుతున్నది. ప్రభు త్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ నేతృత్వంలో చాలా మంది గులాబీ గూటికి వచ్చి చేరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమతిగా ఆవిర్భవించి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత గులాబీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే రాజకీయ కార్యక్రమాలను సైతం చేపడుతున్నారు. పక్క రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న విన్నపాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సైతం మహారాష్ట్రలో పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమై ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడమే ధ్యేయంగా కేసీఆర్ దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే మేటిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ కృషిని మెచ్చిన వారంతా మద్దతు తెలుపుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, షబ్బీర్ అలీ నాయకత్వానికి చాలా మంది గుడ్ బై చెబుతున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు వివిధ విభాగాలకు చెందిన వారంతా హస్తం వదిలి కారు ఎక్కేందుకే ఎక్కువగా దృష్టి సారించారు. ఈ పరిణామాలతో ఏమీ చేయలేక తల పట్టుకునే దుస్థితి కాంగ్రెస్ అగ్రనాయకులకు ఎదురవుతున్నది. ఉద్యమ కాలం నాటి నుంచి నేటి వరకు ఉభయ జిల్లా ప్రజలంతా కేసీఆర్‌కే మద్దతు పలుకుతున్నారు. జాతీయ పార్టీలకు కనీసం డిపాజిట్ దక్కకుండా ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే ప్రజలంతా పట్టం కడుతున్నారు. వరుసగా ఏ ఎన్నికలొచ్చినా ఏకపక్ష విజయాలను అందిస్తున్నారు. సమైక్య పాలనలో అడుగడుగునా తీవ్రమైన నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన తెలంగాణను సీఎం కేసీఆర్ తనదైన శైలిలో పరిపాలిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలబెట్టి దేశంలోనే తెలంగాణకు ప్రత్యేకత గుర్తింపును తీసుకు వచ్చారు.