మద్నూర్, మే 27: తమ పార్టీ అధికారంలో ఉన్నదంటూ, తమను ఎవరేం చేయలేరనే ధీమాతో మద్నూర్ మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మెనూర్ పశువైద్యాధికారి విజయ్‌కుమార్ ఆరోపించారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొన్ని రోజులుగా దరాస్ సాయిలు డబ్బులు ఇవ్వాలని తనను డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని తెలిపారు. సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ, ఎలాంటి తప్పుచేయని తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని సాయిలును ప్రశ్నించానని, దీంతో కక్షగట్టి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు తాను మద్నూర్ గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారిగా ఉండడంతో ఎమ్మెల్యేతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. ఇటీవల తనకు హార్ట్ ఎటాక్ రావడంతో దవాఖానలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు తనను పరామర్శించారని, వాటికి సంబంధించిన ఫొటోలు జోడించి ఫిర్యాదు చేశారన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న దరాస్ సాయిలు ఇకనైనా తనను వేధించడం మానుకోవాలని కోరారు.