నిజాంసాగర్, జూన్ 14 : రుణాల చెల్లింపుల కోసం మహిళా సంఘాలు కట్టిన కిస్తీల సొమ్ము పక్కదారి పట్టింది. నెలనెలా చెల్లించిన డబ్బులు మహిళల ఖాతాల్లో జమకాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. మూడేండ్లుగా సుమారు రూ. 27లక్షలు ఖాతాల్లో జమకాకపోవడంతో ఆందోళన చెందిన సంఘాల సభ్యులు.. అధికారులతోపాటు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ఇప్పటివరకూ వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. తాము చెల్లించిన డబ్బులు కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని మహ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు కోరుతున్నారు.
గ్రామంలోని 11 స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు ప్రతి నెలా పొదుపు నిధులు, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాల కిస్తీలు తదితర మొత్తాలను సీఎస్పీ( కస్టమర్ సర్వీస్ పాయింట్) ద్వారా చెల్లిస్తూ వచ్చారు. 2023లో తమ రుణాలు ఎంత వరకు ముట్టాయి.. ఇంకా ఎంత బాకీ ఉందో తెలుసుకోవడానికి స్టేట్ మెంట్ల కోసం మహిళలు బ్యాంకుకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఖాతాలను పరిశీలించగా సుమారు రూ.27లక్షలు జమ చేయకుండా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ విషయమై మహిళలు.. సీఎస్పీ కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించగా తమకు సంబంధం లేదని, కొంత మొత్తం హసన్‌పల్లి గ్రామానికి చెందిన సీసీ విగ్నేశ్‌కు ఇచ్చినట్లు తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు విగ్నేశ్‌ను నిలదీయగా.. సీఎస్పీలో చెల్లించారా.. తనకు చెల్లించారా అంటూ సమాధానం ఇవ్వడంతో సీసీ పాత్రపై అనుమానులు రేకెత్తాయి. ఈ వ్యవహారంలో మహిళలు అధికారులను నిలదీశారు. స్పందించిన అధికారులు సీఎస్పీ నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసేందుకు ఆర్ఆర్ యాక్టు కేసు నమోదుచేసి, సీసీ విగ్నేశ్‌ను విధుల నుంచి తొలగించారు. దీంతో తమ డబ్బులు వస్తాయని మహిళలు సంతోషించారు. తీరా విధుల నుంచి తొలగించిన సీసీ ఆరునెలల్లో తిరిగి విధుల్లో చేరాడు. సీఎస్పీ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడంతో ఆర్ఆర్ యాక్టు నిలిచిపోయింది. దీంతో మూడేండ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కథ మళ్లీ మొదటికి వచ్చింది.

సంఘాల పేరుతో బకాయిలు ఉన్నాయని చెబుతూ వ్యక్తిగత ఖాతాలను బ్యాంకు అధికారులు నిలిపివేశారు. దీంతో ఉపాధి హామీ కూలితోపాటు ధాన్యం డబ్బులు ఖాతాల్లో నిలిచిపోయాయి. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని, జీవనం భారంగా మారిందని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంఘాల పేరుతో బకాయిలు ఉన్నాయని చెబుతూ వ్యక్తిగత ఖాతాలను బ్యాంకు అధికారులు నిలిపివేశారు. దీంతో ఉపాధి హామీ కూలితోపాటు ధాన్యం డబ్బులు ఖాతాల్లో నిలిచిపోయాయి. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని, జీవనం భారంగా మారిందని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్‌స్టేషన్, ఐకేపీ కార్యాలయం మొదలుకొని కలెక్టర్, డీఆర్డీఏ కార్యాలయాలకు మహిళా సంఘాల సభ్యులు పలుమార్లు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీ ఇంటి వద్ద వంటావార్పు, సీఎస్పీ నిర్వాహకులిరాలి ఇంటి ముట్టడి, పురుగుమందు డబ్బాలతో నిరసనలకు దిగినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రజాప్రతినిధులను కలిసి వారి గోడు వెళ్లబోసుకున్నా వారి సొమ్ము మాత్రం తిరిగిరాలేదు.
ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీఎం ప్రసన్నరాణి తాను బాధ్యతలు స్వీకరించకముందు ఈ ఉదంతం వెలుగుచూసిందని తెలిపారు. ఆర్ఆర్ చట్టం కింద కేసు నమోదైనా వారు హైకోర్టును ఆశ్రయించడంతో తమ చేతుల్లో పెద్దగా ఏమీ లేదని పేర్కొన్నారు. మూడేండ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ఆందోళన చేస్తున్నా తాము చెల్లించిన రూ. 27లక్షలు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని, తమ డబ్బులు తమకు ఎప్పడు వస్తాయో చెప్పాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అసలు డబ్బులు మహిళల ఖాతాల్లో జమ కాకపోతే సంబంధిత ఐకేపీ అధికారులు ఎందుకు గుర్తించలేదని మహిళా సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి హసన్‌పల్లి గ్రామానికి అప్పట్లో మరో సీసీ విధులు నిర్వహిస్తుండగా విగ్నేశ్‌కు డబ్బులు ఇచ్చినట్లు సీఎస్పీ నిర్వాహకులు ఎందుకు చెబుతున్నారని, మూడేండ్లుగా మహిళలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ బాధ్యులపై ఎందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు.
మేము కష్టపడి సంపాదించిన డబ్బులను సంఘం పేరుతో సీ ఎస్పీలో జమ చేశాం. రూ.27లక్షలు మూడేండ్లుగా మాకు అందకుండా పోయాయి. అదే డబ్బును బ్యాంకులో లేదా ఇతర చోట పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాదాపు రూ.40 లక్షల అయ్యేవి. మేము నష్టపోవడానికి బాధ్యులు ఎవరో అధికారులు తేల్చి మా సొమ్ము వెంటనే ఇప్పించాలి.
-కమల, శ్రీ లక్ష్మీ గ్రూపు సభ్యురాలు
మూడేండ్లుగా కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం. కానీ మాకు న్యాయం జరగలేదు. మా ఖాతాలు నిలిపివేయడంతో కూలి డబ్బులు, ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అందడం లేదు. మా డబ్బులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలి. ఇప్పటికైనా మాకు న్యాయం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలి.
-బాధ్యులపై సిద్ధవ్వ, గణేశ్ గ్రూపు సభ్యురాలు